రొంపిచెర్లలో టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి.. ఉద్రిక్తత

  • టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో ఉద్రిక్తత
  • రాళ్లదాడిలో పలువురికి గాయాలు
  • చిత్తూరు నుంచి అదనపు బలగాలు తెప్పించి పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు 
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్లలో వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య జరిగిన రాళ్లదాడితో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రొంపిచెర్ల బస్టాండు సమీపంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన బ్యానర్లను శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. శనివారం ఉదయం ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలు గుర్తించారు. స్థానిక వైసీపీ జడ్పీటీసీ సభ్యుడు రెడ్డీశ్వర్‌రెడ్డి వర్గీయులే ఈ పనికి పాల్పడి ఉంటారని భావించి వారిని ప్రశ్నించారు. విషయం తెలిసిన రెడ్డీశ్వర్‌రెడ్డి నిన్న సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో బస్టాండు వద్దకు వచ్చి తమ కార్యకర్తలను ప్రశ్నించిన వ్యక్తులు బయటకు రావాలని హెచ్చరించారు.

దీంతో కాసేపటికి అక్కడికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. వారు అక్కడికి రాగానే వైసీపీ శ్రేణులు రాళ్లు, బీరు సీసాలతో వారిపైకి దాడులకు దిగారు. ప్రతిగా టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడికి దిగారు. అరంగటపాటు ఇలా ఇరు వర్గాలు రాళ్లదాడికి దిగడంతో అక్కడున్న వారు భయభ్రాంతులకు గురయ్యారు.

రాళ్ల దాడిలో ఇరువర్గాలకు చెందిన పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చిత్తూరు నుంచి అదనపు బలగాలను రప్పించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.


More Telugu News