సూర్యకుమార్ సెంచరీ మోత... టీమిండియా భారీ స్కోరు

  • రాజ్ కోట్ లో చివరి టీ20
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
  • 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు
  • 51 బంతుల్లోనే 112 పరుగులు చేసిన సూర్య
  • 7 ఫోర్లు, 9 సిక్సులతో వీరవిహారం
డాషింగ్ బ్యాట్స్ మన్ సూర్యకుమార్ యాదవ్ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో చిచ్చరపిడుగులా చెలరేగిన వేళ టీమిండియా భారీ స్కోరు సాధించింది. శ్రీలంకతో రాజ్ కోట్ లో జరుగుతున్న చివరి టీ20లో సూర్యకుమార్ ఆకాశమే హద్దుగా చెలరేగి మెరుపు సెంచరీ నమోదు చేశాడు. సూర్య 51 బంతుల్లోనే 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సూర్య స్కోరులో 7 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయంటే అతడి ఊచకోత ఏవిధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. 

మిస్టర్ 360 సూపర్ సెంచరీ సాయంతో టీమండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు సాధించింది. ఓపెనర్ శుభ్ మాన్ గిల్ (46), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 35 పరుగులు; 5 ఫోర్లు, 2 సిక్సులు) రాణించారు. ఓపెనర్ ఇషాన్ కిషన్ 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4, దీపక్ హుడా 4 పరుగులకే అవుటయ్యారు. 

ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్ విజృంభణకు శ్రీలంక బౌలర్లు నిస్సహాయుల్లా మిగిలిపోయారు. తన అమ్ములపొదిలో ఉన్న అస్త్రాలను లంకేయులపై ప్రయోగించిన ఈ ముంబయివాలా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించాడు. కేవలం 43 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సూర్యకుమార్ కు ఇది టీ20ల్లో మూడో సెంచరీ.


More Telugu News