సీబీఐ త్వరలోనే వివేకా హత్య కేసు నిందితుల పేర్లు వెల్లడించే అవకాశం ఉంది: డీఎల్ రవీంద్రారెడ్డి

  • వివేకా హత్య వ్యవహారంపై డీఎల్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • నిందితులు ఎవరో సీఎం జగన్ కు తెలుసని వెల్లడి
  • సీఎం వెల్లడిస్తే మంచి పేరొస్తుందన్న డీఎల్
వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి స్పందించారు. వివేకాను హత్య చేసింది, చేయించింది ఎవరో సీఎం జగన్ కు తెలుసని అన్నారు. సీబీఐ త్వరలోనే వివేకా హత్య కేసులో అసలు నిందితులు ఎవరన్నది వెల్లడించే అవకాశం ఉందని తెలిపారు. ఈలోపే దోషులు ఎవరో చెప్పాలని సీఎం జగన్ కు సూచించారు. 

ఈ కేసులో ఎర్ర గంగిరెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని, ఈ కేసుకు సంబంధించి సర్వం అతనికి తెలుసని డీఎల్ అన్నారు. దీనికి సంబంధించి సీబీఐ వద్ద అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు. 

ఎర్ర గంగిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వివేకా వద్ద ఉంటూ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డిల ఏజెంటుగా మారి వివేకాను ఓడించే ప్రయత్నం చేశాడని వివరించారు. 

"సీఎం గారూ... మీ చిన్నాన్నను చంపింది ఎవరో, చంపించింది ఎవరో మీకు తెలుసు. సీబీఐ ఎలాగూ మరికొన్ని రోజుల్లో నిందితుల పేర్లు వెల్లడిస్తుంది. అందుకే ఈ హత్యకు సుపారీ ఎవరు ఇచ్చారు? ఎవరు హత్య చేశారు? అనేది బయటకు చెప్పండి... మీకైనా మంచి పేరు వస్తుంది. ఈ వ్యవహారంలో తాడేపల్లి ప్యాలెస్ ను కూడా ఎంక్వైరీ చేస్తేగానీ నిజాలు బయటికి రావని అనుకుంటున్నాను" అంటూ డీఎల్ పేర్కొన్నారు.


More Telugu News