విద్యార్థినుల ఫొటోల మార్ఫింగ్ కేసులో నలుగురి అరెస్ట్

  • వీబీఐటీ విద్యార్థినుల కేసులో పురోగతి
  • విజయవాడలో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • నిందితులు ఓ ఫుడ్ కోర్టులో పనిచేస్తున్నారన్న రాచకొండ సీపీ
  • కేసులు నమోదు చేసినట్టు వెల్లడి
హైదరాబాద్ శివార్లలోని వీబీఐటీ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థినుల ఫొటోల మార్ఫింగ్ కేసులో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ వెల్లడించారు. 

నిందితులను విజయవాడలో అరెస్ట్ చేశామని చెప్పారు. వీరు విజయవాడలో ఓ ఫుడ్ కోర్టులో పనిచేస్తున్నారని తెలిపారు. నిందితులు ప్రదీప్ (19), లక్ష్మీగణపతి (19), సతీష్ (20), దుర్గాప్రసాద్ (19) అని సీపీ వివరించారు. 

వీబీఐటీలో ఫస్టియర్ చదువుతున్న ఓ అమ్మాయిని ప్రదీప్ పరిచయం చేసుకుని, ఆమె ద్వారా విద్యార్థినుల వాట్సాప్ గ్రూపులో చేరాడని తెలిపారు. ఆ విధంగా మిగతా విద్యార్థినుల ఫోన్ నెంబర్లు తీసుకున్నారని వెల్లడించారు. వారి ఫోన్లను హ్యాక్ చేసి డేటా మొత్తం తస్కరించారని పేర్కొన్నారు. వారి ఫొటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ గా మార్చి వాట్సాప్ లో పెట్టి బెదిరించారని తెలిపారు. 

నిందితులు ఎంటర్ ద డ్రాగన్, కింగ్ ఈజ్ బ్యాక్ పేరిట కొన్ని వాట్సాప్ గ్రూపులు కూడా క్రియేట్ చేశారని సీపీ డీఎస్ చౌహాన్ వివరించారు. వీరిపై ఐపీసీ సెక్షన్లు, పోక్సో, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేసినట్టు వెల్లడించారు.


More Telugu News