ఈ వంట నూనెలతో కొలెస్ట్రాల్ పెరగదు!

  • శాచురేటెడ్ కంటే మోనో అన్ శాచురేటెడ్ నూనెలు మంచివి
  • పాలీ అన్ శాచురేటెడ్ నూనెలతోనూ ఆరోగ్యానికి మంచిది
  • పల్లీ నూనె, నువ్వుల నూనె, ఆలివ్ నూనె వాడుకోవచ్చు
మన పూర్వీకుల జీవనం వేరు. నేటి మన జీవనం వేరు. 50 ఏళ్ల క్రితం ఎక్కడికి వెళ్లాలన్నా నడకే మార్గం. మరీ ఎక్కువ దూరం ఉంటే ఎడ్లబండి కట్టుకుని పోయేవారు. ఆ తర్వాత సైకిళ్లు వచ్చాయి. క్రమంగా బస్సులు వచ్చాయి. ఆ బస్సు కోసం కూడా చాలా దూరం నడిచి వెళ్లి వచ్చే పరిస్థితి చాలా ప్రాంతాల్లో ఉండేది. కాలు కదపకుండా, వళ్లు వంచకుండా ఏమీ జరిగేది కాదు. దీంతో శరీరంలో తిండి తాలూకూ చెడు కొవ్వులు అంతగా ఉండేవి కాదు. 

కానీ, నేటి జీవనంలో ప్రాసెస్డ్, కెమికల్ ఫుడ్స్ ఎక్కువ కావడం, శ్రమ తగ్గిపోవడంతో చాలా మందిలో జీవక్రియలు సరిగ్గా జరగక చెడు కొవ్వులు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు మన ముందున్న మార్గాల్లో ఆహారమైన మార్పులు చేసుకోవడం, రోజువారీ వ్యాయామాలు చేసుకోవడమే. ఆహారంలో అన్నీ కాకుండా కొన్ని రకాల వంట నూనెలు తీసుకోవడం మంచిది. 

నువ్వుల నూనె
దీని స్మోకింగ్ పాయింట్ తక్కువ. అంటే సలసల కాగించడానికి అనుకూలం కాదు. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. ఒక టేబుల్ స్పూన్ నువ్వుల నూనెలో 5 గ్రాముల మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్, 2 గ్రాముల శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. 

పీనట్ ఆయిల్ (పల్లీ నూనె)
ఈ నూనెను ఎంత వేడిమీద అయినా కాచొచ్చు. కనుక గారెలు, వడలు, పూరీలు తదితర కాగే నూనెలో చేసే వంటలకు అనుకూలం. వేపుళ్లకు ఏ వంట నూనె కూడా అనుకూలం కాదు. కనుక వేపుళ్లను మానుకోవడం మంచిది. 

ఆలీవ్ ఆయిల్
ఇందులోనూ హానికారక కొవ్వులు లేవు. ఆరోగ్యానికి మంచి చేసే వంట నూనెల్లో దీనికి వైద్యులు మొదటి స్థానాన్ని ఇస్తుంటారు. అభివృద్ధి చెందిన దేశాల్లో దీని వినియోగం ఎక్కువ. కొంచెం ఖరీదైనది. ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి. మనకు మంచి చేసే మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. దీని స్మోకింగ్ పాయింట్ తక్కువ. కనుక సన్నని మంటపై చేసే వంటకాలకు వాడుకోవచ్చు.

చియా సీడ్ ఆయిల్
చియాసీడ్స్ నల్ల నువ్వుల మాదిరే ఉంటాయి. ఇందులో ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది గుండెకు మంచి చేసే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉత్పత్తికి సాయపడుతుంది. దీని స్మోకింగ్ పాయింట్ ఎక్కువ. కనుక కాచి చేసే వంటలకు వాడుకోవచ్చు. 

అవకాడో ఆయిల్
అవకాడో పండు నుంచే దీన్ని తయారు చేస్తారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ. ఇన్ ఫ్లమేషన్ ను తగ్గించేందుకు, యాంటీ ఆక్సిడెంట్లుగా ఇది ఉపయోగపడుతుంది.


More Telugu News