మద్యపానంతో కాలేయానికి దెబ్బ.. ప్రాథమిక సంకేతాలు ఇవే!

  • కడుపులో నొప్పి, అలసట ఉంటుంటే అనుమానించాలి
  • దీనికితోడు ఆకలి కోల్పోవడం, కామెర్లు కూడా ప్రమాదకర సంకేతాలే
  • కాలేయంపై భారం పడుతుందని తెలిసిన వెంటనే జాగ్రత్త పడాలి
శరీరంలో 500కు పైగా జీవ క్రియల్లో లివర్ పాత్ర కీలకంగా ఉంటుంది. కనుక కాలేయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ, మద్యం తాగే అలవాటు వల్ల ఎక్కువ భారం పడేది లివర్ పైనే. కాలేయంలో కొవ్వు పెరిగిపోతుంది. దీనికితోడు రోజువారీగా మద్యం సేవించే వారికి కేన్సర్, గుండె జబ్బులు, మెదడు దెబ్బతినడం, స్ట్రోక్ సమస్యల రిస్క్ పెరుగుతుంది. తరచుగా మద్యం సేవించే వారు.. లివర్ చెడిపోతుందనడానికి నిదర్శనంగా కనిపించే కొన్ని ప్రాథమిక సేంకేతాలపై కన్నేసి ఉంచాలి.

కడుపులో నొప్పి, అలసట, తల తిరగడం, విరేచనాలు, అసౌకర్యంగా ఉండడం, ఆకలి కోల్పోవడం ఇవన్నీ లివర్ దెబ్బతినడానికి సంకేతాలే. ఈ సమస్య కొంచెం పెద్దది అయిందనడానికి నిదర్శనంగా.. కామెర్లు, కాళ్లల్లో వాపులు, కాలి మడిమెలు, పాదాలపైనా వాపు కనిపిస్తుంది. జ్వరం, చలి, చర్మంపై దురదలు, జుట్టు రాలిపోవడం, బరువు గణనీయంగా తగ్గడం, బలహీనత, అయోమయం, జ్ఞాపకశక్తి సమస్య, ఇన్సోమియా, రక్తాన్ని కక్కుకోవడం, మలం నల్లరంగులోకి మారిపోవడం కనిపిస్తాయి. 

ఫ్యాటీ లివర్ సమస్య అనేది, భవిష్యత్తులో కాలేయం శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించడంగా పరిగణించాలి. ఫ్యాటీలివర్ సమస్య ఉన్నవారిలో ఆల్కహాల్ హెపటైటిస్ అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంటున్నారు. వాంతులు చేసుకోవడం, చర్మం పసుపు రంగులోకి మారిపోవడం లివర్ ఫెయిల్యూర్ సంకేతాలుగా చూడాలి.

తనంతట తానే రిపేర్ చేసుకోగలిగిన ఏకైక అవయవం కాలేయం. ఆల్కహాల్ కారణంగా కొంత దెబ్బతిన్న కాలేయం తిరిగి గాడిన పడాలంటే, ఆ తర్వాత అయినా మద్యానికి దూరంగా ఉండాలి. అదే పనిగా లివర్ పై భారం మోపుతూ, దెబ్బతినే పరిస్థితిని కల్పించకూడదు. దీనివల్ల కాలేయం తిరిగి మరమ్మతు చేసుకోలేదు. పర్యవసానంగా లివర్ సిర్రోసిస్ కు దారితీస్తుంది. దీనికి శాశ్వత పరిష్కారం లేదు. ఇలాంటి వారు వెంటనే మద్యం అలవాటును మానేస్తే కోలుకునేందుకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. 

మద్యం అధికంగా తాగడం వల్ల రోగ నిరోధక వ్యవస్థ శక్తి క్షీణిస్తుంది. దీంతో మన శరీరం మరిన్ని ఇన్ఫెక్షన్ల బారిన పడే రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా యూరినరీ, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల రిస్క్ అధికమవుతుంది. 



More Telugu News