ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం.. భారత్ లో పావు గంటకో లగ్జరీ కారు అమ్మకం

  • రోజుకు 104 కార్ల విక్రయం
  • 2022 మొత్తం మీద అమ్మకాలు 38,000 యూనిట్లు
  • నిపుణులు, అధిక వేతనాలు ఆర్జించే వారి నుంచి డిమాండ్
అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాలు, పొరుగున ఉన్న చైనా ఆర్థికంగా కష్టాలను చూస్తుంటే.. భారతీయులు ప్రతి పావు గంటకో ఖరీదైన కారును, అంటే గంటకు నాలుగు కార్ల చొప్పున 2022లో కొనుగోలు చేశారు. దేశ ఆర్థిక రంగ కార్యకలాపాలు కరోనా లాక్ డౌన్ ల దశ నుంచి పూర్తి స్థాయిలో సాధారణంగా మారిపోవడంతో.. వాహన అమ్మకాలు కరోనా ముందు నాటి గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. 

2022లో మన దేశంలో సమారు 38,000 లగ్జరీ కార్లు అమ్ముడుపోయాయి. అంటే రోజుకు 104 కార్ల చొప్పున కంపెనీలు విక్రయించాయి. 2021లో ఉన్న గణాంకాలతో పోలిస్తే 50 శాతం ఎక్కువ. కానీ, 2018లో నమోదైన లగ్జరీ కార్ల అమ్మకాల రికార్డ్ 40 వేల మార్క్ ను ఇంకా అధిగమించలేదు. రూ.10 లక్షలకు పైన ఖరీదైన కార్లు గతేడాది 37.9 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. 2021తో పోలిస్తే 23 శాతం ఎక్కువ. 

రూ. కోటి అంతకుమించిన ధరతో కూడినవి లగ్జరీ కార్ల కిందకు వస్తాయి. లగ్జరీ కార్ల విక్రయాల్లో మెర్సెడెజ్ బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. మెర్సెడెజ్ బెంజ్ వద్ద ప్రస్తుతం 6,000 కార్లకు బుకింగ్ లు ఉన్నాయి. వీటికి నాలుగు నుంచి తొమ్మిది నెలల వెయిటింగ్ ఉంది. వృత్తి నిపుణులు, అధిక వేతనాల్లోని యువ వర్గం కార్ల కొనుగోలుకు ప్రాధాన్యమిస్తున్నారు.




More Telugu News