భారత్ జోడో యాత్రలో ఎందుకు పాల్గొన్నదీ వెల్లడించిన కమలహాసన్

  • భారత్ జోడో యాత్రలో పాల్గొన్న 300 మంది కార్యకర్తలకు కమల్ విందు
  • బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్న కమల్
  • దానిని అడ్డుకునేందుకే యాత్రలో పాల్గొన్నట్టు చెప్పిన సినీ నటుడు
ప్రముఖ సినీనటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమలహాసన్ ఇటీవల రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కమల్ సహా ఆయన పార్టీకి చెందిన 300 మంది కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. పాదయాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు నిన్న పార్టీ కార్యాలయంలో కమల్ విందు ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ఎందుకు పాల్గొన్నదీ వెల్లడించారు. దేశంలో బీజేపీ మతవిద్వేషాలు రెచ్చగొడుతోందని, వాటిని అడ్డుకునేందుకు లౌకిక శక్తులు ఏకం కావాలని అన్నారు. అందులో భాగంగానే తాను రాహుల్ యాత్రలో పాల్గొన్నట్టు చెప్పారు. రాష్ట్రంలో తమ పార్టీ విస్తరిస్తోందన్న కమల్.. నేతలు, కార్యకర్తలు ఈ విషయాన్ని గ్రహించాలన్నారు.

పార్టీ అధ్యక్షుడు చేసే ప్రకటనను నేతలు, కార్యకర్తలు శిరసావహించాలని, అందుకు విరుద్ధంగా ప్రకటనలు చేయొద్దన్నారు. తమిళుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేలా పార్టీ వ్యవహరిస్తోందని కమలహాసన్ పేర్కొన్నారు. పండుగ సందర్భంగా రాష్ట్ర సంప్రదాయ క్రీడ జల్లికట్టును మెరీనాబీచ్‌లో నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోరినట్టు చెప్పారు.


More Telugu News