తమిళనాడు గవర్నర్‌పై సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తీవ్ర విమర్శలు

  • గవర్నర్ ఫక్తు రాజకీయ నాయకుడిలా మాట్లాడుతున్నారన్న పీసీ శ్రీరామ్
  • వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదన్న భయం ఆయన యజమానులకు పట్టుకుందని వ్యాఖ్య
  • వారికి లబ్ది చేకూర్చేందుకు రాజకీయ నాయకుడి అవతారం ఎత్తారని విమర్శ
  • ప్రస్తుతం వేర్పాటువాదానికి, ద్వేషభావానికి మధ్య యుద్ధం జరుగుతోందన్న శ్రీరామ్
ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై ట్విట్టర్‌లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఆర్ఎన్ రవి రాష్ట్ర గవర్నర్‌లా కాకుండా ఫక్తు రాజకీయనాయకుడిలా మాట్లాడుతున్నారంటూ శ్రీరామ్ తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లోనూ ఓటమి తప్పదన్న భయం ఆయన యజమానులకు పట్టుకుందని, కాబట్టి ఏదోలా వారికి మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆయన ముందుకు సాగుతున్నారని అన్నారు.

ప్రస్తుతం వేర్పాటు వాదానికి, ద్వేషభావానికి మధ్య యుద్ధం జరుగుతోందన్న ఆయన.. గవర్నర్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. గవర్నర్ మాటల్లో రాజకీయ కోణం ఉందన్నారు. మన దేశభక్తి చరిత్ర మనకు తెలుసని, ప్రతి భారతీయుడు తమ మాతృభాషను ప్రేమిస్తాడని అన్నారు. మాతృభాషపై మనం వ్యక్తం చేసే ప్రేమాభిమానాలనే మనల్ని మంచి మనిషిగా నిలబెడతాయని శ్రీరామ్ వ్యాఖ్యానించారు. చిత్రపరిశ్రమలో నిత్యం బిజీగా ఉంటూ, దేశీయ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఇలా ఒక్కసారిగా రాజకీయాలపై మాట్లాడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.


More Telugu News