ఏపీ బీజేపీలో తీవ్రమైన వర్గపోరు.. కన్నా లక్ష్మీనారాయణపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన సోము వీర్రాజు వర్గం

  • బీజేపీ బలహీన పడటానికి సోము వీర్రాజే కారణమన్న కన్నా
  • కన్నా విమర్శలను హైకమాండ్ కు పంపిన వీర్రాజు వర్గం
  • జనసేనలో కన్నా చేరబోతున్నారంటూ ప్రచారం
దక్షిణాదిలో బలపడాలన్న బీజేపీ ప్రయత్నాలు తెలంగాణను దాటి ముందుకు సాగడం లేదు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతుండగా... ఏపీ, తమిళనాడు, కేరళలో మాత్రం ఏ మాత్రం పుంజుకోలేకపోతోంది. ఏపీ బీజేపీలో మంచి నాయకులు ఉన్నప్పటికీ పార్టీ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. బీజేపీలోని నేతలు టీడీపీ, వైసీపీ మద్దతుదారులుగా రెండు వర్గాలుగా విడిపోయారనే వాదన బలంగా ఉంది. మరోవైపు జనసేనతో బీజేపీకి పొత్తు ఉన్నప్పటికీ... రెండు పార్టీలు కలిసి పని చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు. బీజేపీ అధిష్ఠానం నుంచి కూడా స్పష్టమైన ఆదేశాలు, మార్గనిర్దేశం లేకపోవడంతో నేతలు ఇష్టానుసారం వ్యవహరిస్తూ పార్టీని మరింత బలహీనపరుస్తున్నారు. 

మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు, మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు అసలు పొసగడం లేదు. తాజాగా వీర్రాజుపై కన్నా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. పార్టీ పరిస్థితి ఇంత దారుణంగా ఉండటానికి వీర్రాజే కారణమని కన్నా విమర్శించారు. బీజేపీకి, జనసేనకు మధ్య గ్యాప్ ఏర్పడటానికి కూడా సోము వీర్రాజే కారణమని ఆయన ఆరోపించారు. 

రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా ఉన్నప్పుడు నియమించిన ఆరు జిల్లాల అధ్యక్షులను వీర్రాజు తొలగించారు. దీంతో కన్నా వర్గానికి చెందిన పలువురు నేతలు కూడా పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలోనే వీర్రాజుపై కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర విమర్శలు గుప్పించారు. 

ఈ నేపథ్యంలో, కన్నాపై పార్టీ అధిష్ఠానానికి వీర్రాజు వర్గం ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కన్నా చేసిన విమర్శలను హైకమాండ్ కు పంపినట్టు తెలుస్తోంది. మరోవైపు, బీజేపీని వీడే యోచనలో కన్నా ఉన్నారని... అందుకే ఈ విమర్శలు చేస్తున్నారని వీర్రాజు వర్గం అంటోంది. జనసేనలో కన్నా చేరే అవకాశం ఉందనే ప్రచారం కూడా జోరందుకుంటోంది. మరి, రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో వేచి చూడాలి.


More Telugu News