ఎయిరిండియా విమానంలో ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేసిన ఘటన.. నిందితుడిపై వేటేసిన కంపెనీ

  • అమెరికా ఆర్థిక సేవల కంపెనీ వెల్స్ ఫార్గోలో నిందితుడు  వైస్ ప్రెసిడెంట్
  • తమ ఉద్యోగులు హుందాగా ప్రవర్తించాలని కోరుకుంటామన్న కంపెనీ
  • దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన ఎయిరిండియా
  • క్షమాపణకు బలవంతంగా ఒప్పించారన్న బాధిత వృద్ధురాలు 
  • శంకర్ మిశ్రాపై లుక్ అవుట్ నోటీసుల జారీ 
న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో తాగిన మత్తులో సహ ప్రయాణికురాలైన వృద్ధురాలిపై ఓ వ్యక్తి మూత్రవిసర్జన చేసిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. నవంబరు 26న ఈ ఘటన జరగ్గా తాజాగా వెలుగులోకి వచ్చి కలకలం రేపుతోంది. ఈ ఘటనలో ఎయిరిండియా వ్యవహరించిన తీరుపైనా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

మరోవైపు నిందితుడు శంకర్ మిశ్రాపై ఆయన పనిచేస్తున్న అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ వెల్స్ ఫార్గో వేటేసింది. సంస్థ ఉపాధ్యక్షుడిగా ఉన్న ఆయనను తొలగించింది. తమ ఉద్యోగులు ఉన్నతంగా, బాధ్యతాయుతంగా, హుందాగా ప్రవర్తించాలని కోరుకుంటామని కంపెనీ తెలిపింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు తమను కలవరపెడుతున్నాయని పేర్కొంది. కాగా, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు శంకర్ మిశ్రా కోసం గాలిస్తున్నారు. ఆయనపై లుక్ అవుట్ నోటీసు కూడా జారీ అయింది.

కాగా, అన్నివైపుల నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలతో దిగి వచ్చిన ఎయిరిండియా దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. విమానాల్లో ఇలాంటి ఘటనలు జరిగితే సిబ్బంది వాటిని అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. విమానాల్లో ప్రయాణికులెవరైనా అనుచిత ప్రవర్తనకు పాల్పడితే ఆ విషయాన్ని అధికారులకు నివేదించాలని సంస్థ సీఈవో క్యాంబెల్ విల్సన్ స్పష్టం చేశారు.

శంకర్ మిశ్రాను తాను క్షమించినట్టు వస్తున్న వార్తలపై బాధిత వృద్ధురాలు స్పందించారు. తన అభీష్టానికి వ్యతిరేకంగా నిందితుడిని క్షమించాల్సి వచ్చిందని ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడి ముఖాన్ని తాను చూడాలని అనుకోవట్లేదని చెప్పినా ఎయిండియా సిబ్బంది పట్టించుకోలేదని, అతడిని తన ముందు కూర్చోబెట్టారని అన్నారు. తన భార్య, పిల్లలు ఇబ్బంది పడేలా చేయొద్దని అతడు కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రాధేయపడ్డాడని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనపై విమానయాన సంస్థకు ఫిర్యాదు చేస్తే తొలుత టికెట్ డబ్బులు తిరిగి ఇస్తామన్నారని, కానీ పాక్షికంగా మాత్రమే చెల్లించారని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News