టీ20ల్లో ఇక మీదట యువకులకే ఎక్కువ అవకాశాలు.. ద్రవిడ్ సంకేతాలు

  • పూర్తిగా కుర్రాళ్లతో శ్రీలంకపై ఆడిస్తున్నామన్న ద్రవిడ్
  • వారి విషయంలో మనం ఎంతో ఓపిక పట్టాలని సూచన
  • వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్న బీసీసీఐ కోచ్
టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో సీనియర్లు అయిన విరాట్ కోహ్లీ, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తదితరులకు ఇక మీదట అంతగా అవకాశాలు లభించకపోవచ్చు. ఇప్పటికే టీ20లకు పూర్తి స్థాయి కెప్టెన్ గా హార్థిక్ పాండ్యాను బీసీసీఐ నియమించింది. ఇప్పుడు రాహుల్ ద్రవిడ్ మాటలు వింటుంటే.. సీనియర్ ఆటగాళ్లకు ఇకపై టీ20ల్లో చోటు కష్టమేనన్న సంకేతం ధ్వనిస్తోంది. శ్రీలంకతో రెండో టీ20 తర్వాత టీమిండియా కోచ్ ద్రావిడ్ మీడియాతో మాడ్లాడిన విషయాలను ఒకసారి వినాల్సిందే.

‘‘టీ20 వరల్డ్ కప్ చివరి సెమీ ఫైనల్ లో ఇంగ్లండ్ పై మ్యాచ్ లో ఆడిన వారిలో కేవలం ముగ్గురు, నలుగురు కుర్రాళ్లే శ్రీలంకతో జరిగిన తుది మ్యాచ్ లో ఆడారు. టీ20 తదుపరి దశకు మేము కాస్త భిన్నమైన రూపంలో కనిపిస్తున్నాం. మాది యువ జట్టు. అయినప్పటికీ శ్రీలంకపై గొప్పగా ఆడడం నిజంగా అద్భుతం. వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ పై ఎంతో దృష్టి సారించాం. కనుక టీ20 రూపంలో యువ ఆటగాళ్లను పరీక్షించే అవకాశం మాకు లభించింది. 

ఎవరూ కూడా వైడ్, నోబాల్ వేయాలని అనుకోరు. ఈ ఫార్మాట్ లో అలా వేస్తే ఎంతో నష్టం జరుగుతుంది. ఈ యువ ఆటగాళ్ల విషయంలో మనం కాస్త ఓపిక పట్టాలి. ఎంతో మంది యువ ఆటగాళ్లు ఆడుతున్నారు. వారికి ఇలాంటి గేమ్ లు అవసరం. వారిని అర్థం చేసుకుని, సాంకేతికంగా వారికి మద్దతుగా నిలవాలి. వారిని ప్రోత్సహించడం ద్వారా మంచి వాతావరణం ఏర్పాటు చేయాలి. వారికి ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయి. నేర్చుకుంటున్నారు. అంతర్జాతీయ క్రికెట్ లో నేర్చుకోవడం అన్నది కష్టమైన పని. కనుక మనం ఓపిక పట్టాలి’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు.


More Telugu News