20 కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటా లీక్

  • ఇజ్రాయెల్ కు చెందిన అలన్ గాల్ ప్రకటన
  • యూజర్ల ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ ఐడీ వివరాలు లీకైనట్టు లింక్డెన్ లో పోస్ట్
  • ఆన్ లైన్ పోర్టల్ లో వీటిని విక్రయించినట్టు వెల్లడి
ట్విట్టర్ యూజర్లకు సంబంధించి కీలకమైన డేటా లీక్ అయ్యింది. సుమారు 20 కోట్ల మంది యూజర్ల ఈ మెయిల్ ఐడీ ఇతర వివరాలను హ్యాకర్లు సేకరించి ఆన్ లైన్ హ్యాకింగ్ ఫోరమ్ లో విక్రయించిన సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘హడ్సన్ రాక్’ కు చెందిన అలన్ గాల్ ఈ విషయాన్ని బయట పెట్టారు. డేటా లీక్ పై ట్విట్టర్ స్పందించాల్సి ఉంది. 

అతిపెద్ద డేటా లీక్ లలో ట్విట్టర్ యూజర్ల లీకేజీ ఒకటిగా అలన్ గాల్ పేర్కొన్నారు. 2.35 కోట్ల మంది యూజర్ల యూనిక్ రికార్డులు, వారి ఈ మెయిల్ చిరునామాలు హ్యాకర్ల చేతికి వెళ్లినట్టు లింక్డెన్ లో వెల్లడించారు. హై ప్రొఫైల్ యూజర్ల ఈ మెయిల్, ఫోన్ నంబర్లు హ్యాకర్ల వద్ద ఉన్నట్టు గాల్ వెల్లడించారు. 1,000 మంది ప్రముఖుల ఖాతాలకు సంబంధించిన శాంపిల్స్ ను హ్యాకర్లు అందించారని, ఇందులో ఏవోసీ, బ్రియాన్ కెర్బ్స్, విటాలిక్ బుటెరిన్, కవిన్ ఓ లీరీ, డోనాల్డ్ ట్రంప్ జూనియర్ తదితరుల డేటా ఉన్నట్టు గాల్ అంటున్నారు. కనుక ట్విట్టర్ యూజర్లు తమ ఈ మెయిల్, ఫోన్ కు సందేశాల రూపంలో వచ్చే ఎటువంటి వెబ్ యూఆర్ఎల్ పై క్లిక్ చేయకుండా ఉండడం సురక్షిత చర్య అవుతుంది. 



More Telugu News