వివాహమైన గంటకే భార్యకు విడాకులు.. ఆపై తమ్ముడికిచ్చి వివాహం!

  • ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో ఘటన
  • మనస్పర్థలతో దూరంగా ఉంటున్న భార్య
  • రెండో పెళ్లి చేసుకున్న భర్త
  • పెళ్లి మండపానికి వచ్చి నిలదీసిన భార్య
  • మండపంలోనే రెండో భార్యకు విడాకులిచ్చిన వైనం
వివాహమంటే జీవితాంతం ఒకరికొకరు కలిసుండడం. నూరేళ్ల జీవితంలో కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో జరిగిన వివాహం గంటలోనే ముగిసింది. అస్మోలి పోలీస్ స్టేషన్ పరిధిలోని దబోయి ఖుర్ద్ గ్రామంలో జరిగిందీ ఘటన. పెళ్లికొచ్చిన వారు హ్యాపీ మూడ్‌లో ఉండగానే అనుకోని అతిథి పెళ్లి మండపానికి రావడంతో సమస్య మొదలైంది. ఆ అనుకోని అతిథి మరెవరో కాదు. పెళ్లి కొడుకు మొదటి భార్య.

తాను బతికి ఉండగానే రెండో పెళ్లి ఎలా చేసుకుంటావని భర్తతో గొడవకు దిగింది. గొడవ పెద్దది కావడంతో గ్రామస్థులు అక్కడికి చేరారు. మరోవైపు భార్యకు నచ్చజెప్పేందుకు పెళ్లికొడుకు వేషధారణలో ఉన్న భర్త ప్రయత్నించినప్పటికీ ఆమె వినిపించుకోలేదు. విషయం పోలీసులకు చేరడంతో వారొచ్చి అతడిని స్టేషన్‌కు తీసుకెళ్లారు. 

మరోవైపు, గ్రామ పెద్దలు సమావేశమై ఈ సమస్యకు చక్కని పరిష్కారం ఆలోచించారు. గంట క్రితం మనువాడిన రెండో భార్యకు విడాకులిచ్చి, ఆమెను అతడి తమ్ముడికిచ్చి వివాహం చేస్తే ఏ గొడవా ఉండదని ప్రతిపాదించారు. ఈ సలహా నచ్చడంతో మొదటి భార్య కూడా సైలెంట్ అయింది. దీంతో గంట క్రితం వివాహం చేసుకున్న అమ్మాయికి విడాకులిచ్చిన భర్త.. ఆమెను తన తమ్ముడికిచ్చి అక్కడే వివాహం జరిపించాడు. దీంతో పోలీసు కేసుల గొడవ లేకుండానే సమస్య పరిష్కారమైంది.

రెండో పెళ్లి చేసుకున్న వ్యక్తికి నాలుగేళ్ల క్రితం మొదటి వివాహమైంది. అయితే, ఆ తర్వాత దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో అతడు రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దీంతో సమస్య మొదలైంది. ఈ ఘటనపై ఇరువైపుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.


More Telugu News