కుప్పం ఆసుపత్రిలో టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు... పోలీసులపై ఫైర్

  • కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన
  • నిన్న గొల్లపల్లిలో లాఠీచార్జి
  • నలుగురు టీడీపీ కార్యకర్తలకు గాయాలు
  • కుప్పం కేసీ ఆసుపత్రిలో చికిత్స
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కుప్పం పర్యటనలో నిన్న ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం తెలిసిందే. నిన్న గొల్లపల్లిలో జరిగిన లాఠీచార్జిలో నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. వారికి కుప్పం కేసీ ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. నేడు కేసీ ఆసుపత్రికి వెళ్లిన చంద్రబాబు అక్కడ చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. 

తమ కార్యకర్తల మనోధైర్యాన్ని, నిబ్బరాన్ని దెబ్బతీసే పరిస్థితికి వచ్చారని ప్రభుత్వంపై మండిపడ్డారు. లాఠీచార్జి ఘటనను ఖండిస్తున్నట్టు చంద్రబాబు తెలిపారు. గాయాలతో ఆసుపత్రిపాలైన తమ కార్యకర్తలు ఎంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఓ కార్యకర్త చేయిపై పడిన దెబ్బ తీవ్రమైనది కావడంతో, నరాలు దెబ్బతిన్నాయో, ఇంకేం దెబ్బతిన్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొందని, డాక్టర్లు తదుపరి పరీక్షలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఒక కార్యకర్త ఆ దెబ్బలకు స్పృహకోల్పోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారని విమర్శించారు. 

"కుప్పం ఏమైనా యుద్ధభూమి అనుకుంటున్నారా? ఇదేమైనా పాకిస్థానా? లేకపోతే శత్రుదేశమా? 1500 మంది పోలీసులు ఎందుకు రావాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలి. ప్రశాంతంగా ఉన్న కుప్పం నియోజకవర్గంలో దాడి చేసింది పోలీసులు... దాడి చేయించింది శాడిస్ట్ సైకో ముఖ్యమంత్రి. దాడితో మమ్మల్ని బెదిరించాలని ప్రయత్నించారు. వీళ్లు నన్ను ఏంచేస్తారో తెలియకుండా ఉంది. 

నాడు నా ఇంటి గేటుకు తాళ్లు కట్టారు. ఆత్మకూరు వాసులకు సంఘీభావం తెలపడానికి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. ఆ రోజే చెప్పాను... మీ ప్రవర్తన మార్చుకోకపోతే ఈ తాళ్లే ఉరితాళ్లవుతాయని చెప్పాను. అయినా మారలేదు వీళ్లు. రాజధాని ప్రాంతానికి వెళితే నాపైనే దాడి చేయించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ఉందని నాటి డీజీపీ కొత్త నిర్వచనం ఇచ్చారు. 

విశాఖపట్నం వెళితే నన్ను ముందుకు పోనివ్వకుండా అడ్డుకున్నారు. తిరుపతిలో రిగ్గింగ్ జరుగుతుంటే వెళ్లాలనుకుంటే అక్కడా అడ్డుకున్నారు. మా ఇంటిపై దాడి చేసి, అదేమని అడిగితే మెమొరాండం ఇచ్చేందుకు వచ్చారని ఓ డీసీపీ సమర్థించుకుంటాడు. డ్రగ్స్ పై, గంజాయిపై పోరాడుతుంటే మా ఆఫీసుపై దాడి చేశారు. 

నేనేమైనా కుప్పం వచ్చింది యుద్ధం చేయడానికా? ఇది నా నియోజకవర్గం. మూడ్నెల్లకోసారి వస్తానని చెప్పాను. గ్రామాల్లో తిరుగుతూ సమస్యలపై ప్రజలతో మాట్లాడేందుకు వస్తే 1500 మంది పోలీసులు దాడి చేశారు. తిరిగి మాపైనే తప్పుడు కేసులు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా నేను వాడుతున్న ప్రచార రథాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

ఎక్కడెక్కడి నుంచో వచ్చిన పోలీసు అధికారులు ఇక్కడ కేసులు పెట్టారు. తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులకు మనసెలా ఒప్పింది? మీ ఇంట్లో మీ ఆడవాళ్లు ఎలా ఒప్పుకుంటారు? మీ పిల్లలు ఎలా ఒప్పుకుంటారు? ఏం డాడీ తప్పుడు కేసులు పెట్టావు... సిగ్గులేదా అని పిల్లలు అడగరా? పోలీసు అధికారులపై ఒత్తిళ్లు ఉంటే ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు పోతారు... ఏమవుతుంది? మీకు అడ్డం లేదనుకుంటున్నారు... నా నియోజకవర్గంలో బరితెగించారు. కుప్పం కాదు, పుంగనూరు కాదు, తంబళ్లపల్లి గురించి కూడా చెబుతున్నా. ఇలాంటి రౌడీయిజాన్ని అణచివేస్తా" అంటూ చంద్రబాబు నిప్పులు చెరిగారు.


More Telugu News