గృహ రుణం ఒక్కటి కాదు.. చాలా రకాలు

  • ఇంటి నిర్మాణం కోసం తీసుకుకోవచ్చు
  • నిర్మించిన, వినియోగించిన ఇంటి కొనుగోలుకు తీసుకోవచ్చు
  • ఇంటి నవీకరణ, విస్తరణ కోసం కూడా అందుబాటులో రుణాలు
సొంతింటి కల నెరవేర్చుకునేందుకు మధ్య తరగతి వాసులకు అందుబాటులో ఉన్న సాధనం గృహ రుణం. ఇంటి కొనుగోలుకు అయ్యే వ్యయంలో 20 శాతాన్ని డౌన్ పేమెంట్ కింద సొంతంగా సమకూర్చుకోగలిగితే, మిగిలింది బ్యాంక్ లు ఇస్తాయి. కేవలం ఇంటి కొనుగోలుకే అని కాకుండా గృహ రుణాల్లో చాలా రకాలు ఉన్నాయి.

ఇంటి నిర్మాణం కోసం తీసుకునే రుణం. ప్లాట్ కొనుగోలు చేసి, అందులో ఇల్లు కట్టుకునేందుకు రుణం తీసుకోవచ్చు. లేదంటే తమకు ప్లాట్ ఉంటే, అందులో ఇంటి నిర్మాణం కోసం ఈ రుణం తీసుకోవచ్చు. ప్లాట్ కొనుగోలు చేసిన ఏడాదిలోపు గృహ రుణానికి దరఖాస్తు పెట్టుకుంటే అప్పుడు ప్లాట్ ఖరీదు, ఇంటి నిర్మాణ వ్యయానికి కలిపి బ్యాంకులు రుణం ఇస్తాయి. కొనుగోలు చేసిన ఏడాది దాటితే ఇక ప్లాట్ రేటును పరిగణనలోకి తీసుకోవు. ఇంటి నిర్మాణ వ్యయానికే రుణం లభిస్తుంది.

ఇంటి కొనుగోలుకు తీసుకునే రుణం మరో రకం. కొత్త భవనం లేదా ఫ్లాట్, లేదంటే అప్పటికే వినియోగంలో ఉన్న ఇల్లు లేదా ఫ్లాట్ కు ఈ రుణం లభిస్తుంది. కొత్త ఇంటికి రుణం తీసుకుంటుంటే ఇంటి నిర్మాణ వ్యయంలో 90 శాతానికి లభిస్తుంది. 

ఇంటి విస్తరణ కోసం కూడా రుణం తీసుకోవచ్చు. అప్పటికే నిర్మించిన ఇంటిని మరింత విస్తరించడం, లేదంటే పైన మరో అంతస్తు వేయడం వంటివి ఈ రుణం తీసుకుని చేసుకోవచ్చు. దీన్ని హోమ్ ఎక్స్ టెన్షన్ లోన్ అంటారు.
 
ఇంటి నవీకరణ కోసం హోమ్ ఇంప్రూవ్ మెంట్ రుణాలు కూడా లభిస్తాయి. ఇళ్లకు మరమ్మతులు, పెయింటింగ్, పునరుద్ధరణ ఇవన్నీ కూడా దీనికిందకు వస్తాయి.

ప్రస్తుతమున్న ఇల్లు లేదా ఫ్లాట్ ను విక్రయించి, కొత్తది సమకూర్చుకునేందుకు తీసుకునేది బ్రిడ్జ్ లోన్. ముందు రుణంతో మరో ప్రాపర్టీ కొనుగోలు చేసి, అప్పటికే ఉన్న ప్రాపర్టీని విక్రయించిన తర్వాత వచ్చే డబ్బులతో రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వీటి కాల వ్యవధి రెండేళ్లు ఉంటుంది.


More Telugu News