జాతి వివక్షకు దీటైన సమాధానం ఇచ్చి మనసులు గెలుచుకున్న బాలీవుడ్ నటుడు సతీశ్ షా

  • లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఘటన
  • వీరు ఫస్ట్ క్లాస్ టికెట్లు ఎలా కొనగలుగుతున్నారని ఓ అధికారి హేళన
  • ‘ఎందుకంటే మేం భారతీయులం’ అంటూ సగర్వంగా సమాధానమిచ్చిన షా
  • షా ట్వీట్‌పై వెల్లువెత్తుతున్న ప్రశంసలు
  • క్షమాపణలు చెప్పిన హీత్రూ విమానాశ్రయం
లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో తాను జాతి వివక్ష ఎదుర్కొన్నట్టు బాలీవుడ్ ప్రముఖ నటుడు సతీశ్ షా తెలిపారు. తాను విమానం ఎక్కుతున్న సమయంలో ఉద్యోగి ఒకరు తనను ఉద్దేశించి.. వీరు ఫస్ట్‌క్లాస్ టికెట్లు ఎలా కొనగలరని హేళనగా అన్నాడని పేర్కొన్నారు. దీనికి తాను ‘ఎందుకంటే మేం భారతీయులం’ అని గర్వంగా నవ్వుతూ చెప్పానని ట్విట్టర్ ద్వారా తెలిపారు. షా ట్వీట్‌కు విపరీతమైన స్పందన లభించింది. ఇప్పటికే 14 వేలకు పైగా లైకులు, వందలాది కామెంట్లు వచ్చాయి. ఈ ట్వీట్‌పై హీత్రూ విమానాశ్రయం స్పందించింది. సతీశ్ షాకు క్షమాపణలు తెలిపింది. 

రేసిస్ట్ అధికారికి షా ఇచ్చిన సమాధానంపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. జాతివివక్ష వ్యాఖ్యలు చేసిన అధికారిపై యూకే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, హమ్ ఆప్‌ కే హై కౌన్, హమ్ సాథ్ సాథ్ హై, కహోనా ప్యార్ హై, మై హూ నా, కిచిడీ సహా పలు చిత్రాల్లో నటించిన సతీశ్ షా చివరిసారి 2014లో ‘హమ్‌షకల్స్’లో కనిపించారు. టీవీ కామెడీ షో ‘సారాభాయ్ వర్సెస్ సారాభాయ్’తో ఆయనకు మంచి గుర్తింపు లభించింది.


More Telugu News