ప్రజా సమస్యల కంటే పార్టీ సమస్యలు పెద్దవి కాదు: రేవంత్ రెడ్డి

  • అధిష్ఠానం ఏది ఆదేశిస్తే తాను అదే చేస్తానన్న రేవంత్
  • పోలవరం ప్రాజెక్టుపై కేసీఆర్ స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ 
  • కేసీఆర్ కు స్వప్రయోజనాలే ముఖ్యమని విమర్శ
తనకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాలే శిరోధార్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఏది ఆదేశిస్తే తాను అదే చేస్తానని చెప్పారు. టీపీసీసీ అధ్యక్ష పదవిలో ఎవరిని కూర్చోబెట్టినా వారిని తాను భుజాలపై ఎత్తుకుని మోస్తానని అన్నారు. పీసీసీ పదవిని తాను త్యాగం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే తాను ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని చెప్పారు. పార్టీలోని అంతర్గత సమస్యల కంటే ప్రజా సమస్యలే తనకు ఎక్కువని అన్నారు. పది పనులు చేస్తున్నప్పుడు ఒకటో, రెండో తప్పులు దొర్లడం సహజమేనని చెప్పారు.  

ఏపీకి వెళతానంటున్న కేసీఆర్ పోలవరం ప్రాజెక్టుపై తన స్టాండ్ ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. పోతిరెడ్డిపాడు రాయలసీమ లిఫ్ట్ పై కేసీఆర్ ఎటువైపు ఉంటారని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి జలాల విషయంలో కేసీఆర్ ఏ రాష్ట్రానికి అనుకూలంగా ఉంటారని అడిగారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యం కాదని, ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. ప్రజాసంక్షేమం పట్టని కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఎందుకు నమ్మాలని ప్రశ్నించారు.


More Telugu News