తెలంగాణలోకి అత్యంత వేగంగా వ్యాప్తిచెందే కరోనా ఎక్స్​బీబీ15 వేరియంట్!

  • రాష్ట్రంలో మూడు కేసుల గుర్తింపు
  • దేశంలో ఇప్పటిదాకా ఇలాంటి కేసులు ఆరు నమోదు
  • అమెరికా, యూకేలో కరోనా వేవ్ కి కారణమైన వేరియంట్ ఇదే 
అమెరికా, ఇంగ్లండ్ లో కరోనా వేవ్ కి కారణమైన కొవిడ్ సూపర్ వేరియంట్ ఎక్స్ బీబీ 15 తెలంగాణకు చేరుకుంది. రాష్ట్రంలో ఇలాంటి కేసులు మూడింటిని గుర్తించినట్టు హైదరాబాద్ లోని జన్యు ఆధారిత ప్రయోగశాల తెలిపింది. ఇలాంటి కేసులు దేశంలో ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో వెలుగు చూడగా, తాజాగా తెలంగాణలో కూడా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. 

డిసెంబర్–జనవరి 2 మధ్య దేశంలో ఆరు ఎక్స్ బీబీ 15 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. తొలిసారి ఎక్స్ బీబీ 15ని న్యూయార్క్‌లో గుర్తించిన జేపీ వీలాండ్‌ సహా ఇతర జన్యు శాస్త్రవేత్తలు దీని గురించి చెబుతూ.. ఇది వైరస్ ను వేగంగా వ్యాప్తి చేసే వేరియంట్ అని, దీనివల్ల కరోనా వేవ్స్ మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. 

ఎక్స్ బీబీ 15 అనేక ముఖ్యమైన ఉత్పరివర్తనాలను పొందడం వలన ఇది ఇప్పటి వరకు అత్యంత రోగనిరోధక శక్తి కలిగిన వేరియంట్ గా మారిందని చెబుతున్నారు. మునుపటి ఒమిక్రాన్ వేరియంట్‌ల కంటే చాలా వేగంగా వ్యాప్తి చెందగల సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. ఎక్స్ బీబీ 15 వల్ల అమెరికాలో చాలా మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. వారం వ్యవధిలోనే అమెరికాతో పాటు ఇంగ్లండ్ లో 40 శాతానికి పైగా కొవిడ్ వ్యాప్తికి ఈ వేరియంట్ కారణం అయిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేగంగా సోకే అవకాశం ఉన్నందున జన్యు శాస్త్రవేత్తలు దీనిని అనధికారికంగా సముద్ర రాక్షసుడు.. 'క్రాకెన్' అని పిలవడం ప్రారంభించారు.


More Telugu News