ముక్కులో రోగనిరోధకత తగ్గడమే జలుబుకు కారణం: హార్వర్డ్ పరిశోధకులు

  • ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గినా మంచి బ్యాక్టీరియా సగం చనిపోతుందని వెల్లడి
  • ఫ్లూ సహా శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుందని హెచ్చరిక
  • సమతుల ఆహారం, వ్యాయామం చేయడమే మార్గమని సూచన
చలికాలంలో జలుబు చేయడం సర్వసాధారణం.. ఏటా ఈ సీజన్ ముగిసేలోగా ప్రతీ ఒక్కరూ ఒక్కసారైనా జలుబుతో ఇబ్బంది పడుతుంటారు. అయితే, చలికాలంలో జలుబు చేయడానికి, ఫ్లూ బారిన పడడానికి అసలు కారణం ముక్కులో రోగనిరోధకత స్థాయులు పడిపోవడమేనని హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో ముక్కలోపల ఉండే మంచి బ్యాక్టీరియా సామర్థ్యం తగ్గిపోతుందని చెప్పారు. దీంతో వైరస్ తో పోరాడే శక్తిని కోల్పోతాయని, ఫలితంగా జలుబు సహా ఇతర శ్వాసకోశ సమస్యల బారిన పడతామని వివరించారు.

ఈమేరకు అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బెంజమిన్ బ్లెయిర్ ఆధ్వర్యంలో హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో ఈ విషయాన్ని గుర్తించారు. ఈ పరిశోధనా ఫలితాలను జర్నల్ ఆఫ్ అలర్జీ అండ్ క్లినికల్ ఇమ్యునాలజీ ప్రచురించింది. ముక్కులో ఉష్ణోగ్రతలు కొద్దిమేర తగ్గినా సరే మంచి బ్యాక్టీరియా దాదాపు 50 శాతం నాశనం కావడాన్ని గుర్తించినట్లు బెంజమిన్ బ్లెయిర్ తెలిపారు. వైరల్ ఇన్ ఫెక్షన్లకు ప్రధాన కారణం చలిగాలులేనని ఆయన పేర్కొన్నారు. 

అందుకే చలిగాలుల నుంచి రక్షణకు, తద్వారా ముక్కు లోపల ఉష్ణోగ్రతలు తగ్గకుండా కాపాడుకోవడానికి మాస్క్ వాడాలని ఆయన సూచించారు. అదేవిధంగా సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలోని రోగనిరోధకతను బలంగా ఉంచుకోవచ్చని సలహా ఇచ్చారు. నిత్యం వ్యాయామం చేయడం వల్ల అనారోగ్యాల బారి నుంచి తప్పించుకోవచ్చని, ఒకవేళ అనారోగ్యంపాలైనప్పటికీ మిగతా వాళ్లకంటే త్వరగా కోలుకోవచ్చని డాక్టర్ బెంజమిన్ బ్లెయిర్ వివరించారు.


More Telugu News