సంచలన రికార్డుతో చరిత్ర సృష్టించిన టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్

  • ఢిల్లీతో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్
  • ఢిల్లీ జట్టులో ఆరుగురు ఆటగాళ్ల డకౌట్
  • 39 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టిన ఉనద్కత్
టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ సంచలన రికార్డును తన పేరిట రాసుకున్నాడు. దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత జట్టులో చోటు సంపాదించుకుని బంగ్లాదేశ్‌తో ఇటీవల జరిగిన టెస్టులో ఆడిన ఉనద్కత్.. తాజాగా జరుగుతున్న రంజీ ట్రోఫీలో సంచలనం సృష్టించాడు. సౌరాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఉనద్కత్ రాజ్‌కోట్‌లో ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో హ్యాట్రిక్ నమోదు చేసి అత్యంత అరుదైన రికార్డును తన పేర రాసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 12 ఓవర్లు వేసి 39 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టి మరో రికార్డు సృష్టించాడు. అతడి కెరియర్‌లోనే ఇది అత్యుత్తమం.

తొలి ఓవర్ మూడు, నాలుగు, ఐదు బంతులకు వరుసగా ధ్రువ్ షోరే, రావల్, యశ్‌దుల్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించి మరో 5 వికెట్లు పడగొట్టాడు. అతడి దెబ్బకు ఢిల్లీ జట్టు బ్యాటింగ్ పేకమేడలా కుప్పకూలింది. 133 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులోని మొత్తం ఆరుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. అందులో ముగ్గురు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగారు.  

కాగా, ఓ రంజీ మ్యాచ్‌లో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించడం ట్రోఫీ చరిత్రలోనే ఇది తొలిసారి. 2017-8లో కర్ణాటక పేసర్ వినయ్ కుమార్ హ్యాట్రిక్ సాధించినప్పటికీ అది మొదటి-మూడో ఓవర్‌ల మధ్య ఉంది. అంటే తొలి ఓవర్‌ చివరి బంతికి ఒక వికెట్ పడగొట్టిన వినయ్ కుమార్.. ఆ తర్వాత తాను వేసిన మూడో ఓవర్‌లో తొలి రెండు బంతులకు రెండు వికెట్లు తీసి హ్యాట్రిక్ అందుకున్నాడు. ముంబైతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో వినయ్ కుమార్ ఈ ఘనత సాధించాడు. అయితే, తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ సాధించడం మాత్రం రంజీ చరిత్రలోనే ఇది తొలిసారి. ఐదు వికెట్ల ప్రదర్శన ఉనద్కత్‌కు ఇది 21వ సారి. కాగా, నిన్న తొలిరోజు ఆట ముగిసే సమయానికి సౌరాష్ట్ర వికెట్ నష్టానికి 184 పరుగులు చేసి ఢిల్లీ కంటే 51 పరుగుల ఆధిక్యంలో ఉంది.


More Telugu News