టోక్యోను విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్తే రూ. 6.35 లక్షలు.. జపాన్ ప్రభుత్వం ఆఫర్!

  • 3.80 కోట్లకుపైగా జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా టోక్యోకు గుర్తింపు
  • అందరూ టోక్యోకు వచ్చేస్తుండడంతో పడిపోతున్న ఇతర నగరాల జనాభా
  • 2019 నుంచి ప్రోత్సాహకాలు ఇస్తున్న జపాన్
  • 2021లో టోక్యోను వీడింది 2,400 కుటుంబాలు మాత్రమే
టోక్యోలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న జనాభాను నియంత్రించలేకపోతున్న జపాన్ ప్రభుత్వం తాజాగా మరో ఆఫర్ ప్రకటించింది. రాజధాని నగరాన్ని విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇప్పటివరకు ఇస్తున్న ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. టోక్యో 3.80 కోట్లకుపైగా జనాభాతో ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రోపాలిటన్ నగరంగా రికార్డులకెక్కింది. టోక్యోకు ప్రజలు పోటెత్తుతుండడంతో మిగిలిన పట్టణాల్లో జనాభా తగ్గిపోయి సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి. ఇతర నగరాల్లో జనం లేక వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. ఫలితంగా ఆస్తుల విలువ పడిపోతోంది. దీంతో టోక్యో నుంచి వలసలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మరిన్ని ప్రోత్సాహకాలు ప్రకటించింది.

టోక్యోను వీడే కుటుంబంలోని ఒక్కో బిడ్డకు ప్రభుత్వం గతంలో 3 లక్షల యెన్‌ల చొప్పున ఇవ్వగా, ఇప్పుడు దానిని రూ. 10 లక్షల యెన్‌ల (దాదాపు రూ. 6.35 లక్షలు) కు పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇది అమల్లోకి రానుంది. జననాల రేటు తక్కువగా ఉన్న, వృద్ధులు అధికంగా ఉన్న ప్రాంతాలకు కుటుంబాలు తరలివెళ్లేందుకు 2019 నుంచి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోంది. 

ఒకరికంటే ఎక్కువమంది పిల్లలున్న కుటుంబానికి గతంలో 30 లక్షల యెన్‌‌లవరకు ఆర్థిక సాయంతోపాటు ఒక్కో బిడ్డకు 3 లక్షల యెన్‌ల చొప్పున చెల్లించింది. వెళ్లిన ప్రాంతంలో సొంతంగా ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే అందుకు కూడా ఆర్థిక సాయం అందించేది. అయినప్పటికీ మార్పు కనిపించలేదు. 2021లో 2,400 కుటుంబాలు మాత్రమే టోక్యోను వీడి ఇతర ప్రాంతాలకు వెళ్లాయి. దీంతో ప్రభుత్వం ప్రోత్సాహకాన్ని మరింత పెంచింది.


More Telugu News