తమిళనాడులో బీజేపీకి గుడ్‌బై చెప్పేసిన సినీనటి గాయత్రీ రఘురామ్

  • 2014లో బీజేపీలో చేరిన నటి గాయత్రీ రఘురామ్
  • పార్టీలో మహిళలకు సమాన హక్కులు, గౌరవం లేవని ఆరోపణ
  • అధ్యక్షుడు అన్నామలై తీరు నచ్చకే పార్టీని వీడుతున్నట్టు ప్రకటన
  • నష్టమేమీ లేదన్న బీజేపీ సీనియర్ నేత
‘రేపల్లెలో రాధ’, ‘మా బాపు బొమ్మకు పెళ్లంట’, ‘లవ్ ఫెయిల్యూర్’ వంటి చిత్రాల్లో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ నటి గాయత్రీ రఘురామ్ బీజేపీకి రాంరాం చెప్పేశారు. 2014లో బీజేపీలో చేరిన గాయత్రి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైపై తీవ్ర ఆరోపణలు చేశారు. బీజేపీలో మహిళలకు సమాన హక్కులు, గౌరవం లేవని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ట్వీట్ చేశారు. అన్నామలై వ్యవహారశైలి ఏమాత్రం బాగోలేదన్నారు. తనతో కలిసి దాదాపు 8 ఏళ్లపాటు పనిచేసిన కార్యకర్తలకు గాయత్రి కృతజ్ఞతలు చెప్పారు. గౌరవం లేని చోట ఉండొద్దని వారికి విజ్ఞప్తి చేశారు. కాగా, గాయత్రి ఇప్పటి వరకు ఆ పార్టీ కల్చరల్ విభాగం అధ్యక్షురాలిగా పనిచేశారు.

గాయత్రి ఆరోపణలపై బీజేపీ  సీనియర్ నేత ఒకరు స్పందించారు. ఆమె బయటకు వెళ్లిపోయినందువల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. కాగా, ఇతర రాష్ట్రాలు, బీజేపీ ఓవర్సీస్ తమిళ డెవలప్‌మెంట్ యూనిట్‌కు అధ్యక్షురాలిగానూ ఉన్న గాయత్రి.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నారంటూ అధ్యక్షుడు అన్నామలై గతేడాది నవంబరు 23న సస్పెండ్ చేశారు. పదవుల నుంచి ఆరు నెలలపాటు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే, అంతకుముందు ఆమె ముఖ్యమంత్రి స్టాలిన్ కుటుంబ సభ్యులను కలిశారు. ఇది పార్టీలో కాక రేపింది. ద్రోహులకు పార్టీలో చోటు ఉండదని బీజేపీ నేత అమర్ ప్రసాద్‌రెడ్డి ఆగ్రహం వ్యక్త చేశారు. అయితే, తాను వెళ్లింది డీఎంకే చీఫ్‌ను కలిసేందుకు కాదని, ఫ్రెండ్ పుట్టిన రోజుకు వెళ్లానని, వారు ఎవరెవరిని ఆహ్వానించారో తనకు తెలియదని అప్పట్లో గాయత్రి వివరణ ఇచ్చారు.

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 10 సినిమాల్లో నటించిన గాయత్రి కొరియోగ్రాఫర్ కూడా. తెలుగులో చివరిసారి 2021లో విడుదలైన ‘రంగ్ దే’ సినిమాలో నితిన్ సోదరిగా గాయత్రి కనిపించారు.


More Telugu News