నిన్న ఏపీ నేతలను కేసీఆరే పిలిపించారు: బండి సంజయ్

  • బీఆర్ఎస్ లో చేరిన ఏపీ నేతలు
  • ఏపీ నేతలను తీసుకువచ్చేందుకు కేసీఆర్ 100 కార్లు పంపారన్న బండి సంజయ్
  • తెలంగాణలో బీఆర్ఎస్ కు అధ్యక్షుడు లేరని వెల్లడి
  • ఏపీకి మాత్రం అధ్యక్షుడ్ని ప్రకటించారని వ్యంగ్యం
ఏపీ నేతలు రావెల కిశోర్ బాబు, తోట చంద్రశేఖర్, పార్థసారథి తదితరులు నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం తెలిసిందే. ఏపీ నేతలకు పార్టీ కండువా కప్పిన కేసీఆర్ వారిని బీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. అంతేకాదు, తోట చంద్రశేఖర్ ను బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడిగా ప్రకటించారు. 

దీనిపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ స్పందించారు. ఏపీ నేతలను కేసీఆరే హైదరాబాద్ కు పిలిపించారని ఆరోపించారు. ఏపీ నేతలను తీసుకువచ్చేందుకు 100 కార్లు పంపారని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు అధ్యక్షుడు లేరు కానీ, ఏపీకి మాత్రం ప్రకటించారని ఎద్దేవా చేశారు. అసలు, బీఆర్ఎస్ కు జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని ప్రశ్నించారు. 

ఏపీ ప్రజలను గతంలో కేసీఆర్ అవమానించింది నిజం కాదా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. నిన్నటి సభలో కేసీఆర్ కనీసం జై తెలంగాణ అని కూడా అనలేదని ఆరోపించారు. 

కేసీఆర్ ఇంకా 2014లోనే ఉన్నాడని, కేసీఆర్ కు మైండ్ అప్ డేట్ కాలేదని వ్యంగ్యంగా అన్నారు. భారత్ ఇవాళ ఆయుధాలు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తోందని, కరోనా సంక్షోభ సమయంలో వ్యాక్సిన్ తయారుచేసి 100కి పైగా దేశాలకు పంపిందని బండి సంజయ్ వివరించారు. కేసీఆర్ గనుక ప్రపంచ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి అన్నిదేశాలు తిరిగితే అప్పుడు భారత్ ఘనత అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.


More Telugu News