ఈ జీవోతో జగన్ ప్రజాస్వామ్య హంతకుడిగా మారాడు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • జీవో నెం.01 తీసుకువచ్చిన ఏపీ సర్కారు
  • రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం
  • ఇది రాజ్యాంగ వ్యతిరేక జీవో అన్న బుచ్చయ్య
  • ఈ జీవో సీఎంకు వర్తించదా అంటూ ఆగ్రహం
రోడ్లపై రాజకీయ పార్టీల సభలు, ర్యాలీలను నిషేధిస్తూ వైసీపీ సర్కారు జీవో నెం.01 తీసుకురావడంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్యచౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ జీవోతో జగన్ ప్రజాస్వామ్య హంతకుడిగా మారాడని విమర్శించారు. కమ్ముకొస్తున్న ప్రజాగ్రహాన్ని కాలంచెల్లిన బ్రిటీష్ చట్టాలు, ఇలాంటి చీకటి జీవోలతో ఆపడం జగన్ రెడ్డి తరంకాదని అన్నారు. 

మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నూతన సంవత్సర కానుకగా వైసీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కుల్ని హరిస్తూ చీకటి జీవో (జీవో ఆర్.టీ.01) తెచ్చిందని వ్యంగ్యంగా అన్నారు. బ్రిటీష్ పాలకులు అమలుచేసిన 1861 పోలీస్ యాక్ట్ ను ఆధారం చేసుకొని ప్రభుత్వం జీవో నెం.01 తీసుకొచ్చిందని వివరించారు. జగన్ రెడ్డి తీసుకొచ్చింది ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేక జీవో అని పేర్కొన్నారు. 

"జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఏడాదికే పత్రికలు, ఛానళ్లు, సోషల్ మీడియాపై విషం చిమ్ముతూ జీవో.2430ను తెచ్చి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో మొట్టికాయలు తిన్నాడు. అయినా సిగ్గూశరం లేకుండా మరలా జీవో నెం.01 తో ప్రజాస్వామ్యాన్ని చెరబట్టాలని చూస్తున్నాడు. తన పాలనలోని డొల్లతనం ప్రజలు గ్రహించి, ప్రతిపక్షనేత చంద్రబాబుని ఆదరిస్తున్నారన్న అక్కసుతోనే జగన్ రెడ్డి జీవో నెం.01 తీసుకొచ్చాడు. 

జీవోఆర్.టీ.01 తీసుకురావడానికి గుంటూరు కందుకూరు ఘటనలే కారణమని ప్రభుత్వం చెబుతోంది. ఆ రెండు దుర్ఘటనల వెనుక వైసీపీ కుట్రకోణం ఉందనే అనుమానాలున్నాయి. ప్రతిపక్షనేత కార్యక్రమాల్లో వైసీపీ వాళ్లే ఉద్దేశపూర్వకంగా అలజడి, తోపులాట సృష్టించారని మాకు అనుమానాలున్నాయి. ఆ రెండు దుర్ఘటలనపై సీబీఐతో లోతుగా విచారణ చేయించి, వాస్తవాలు బహిర్గతంచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. 

జీవో నెం.01పై  మేం ప్రజా క్షేత్రంలో, న్యాయస్థానాల్లో పోరాడి ముఖ్యమంత్రితో తేల్చుకుంటాం. రోడ్లపై ఎక్కడా ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టకూడదని అర్థరాత్రి జీవో ఇచ్చిన జగన్ రెడ్డి, నేడు రాజమహేంద్రవరంలో సభ ఎలా పెట్టాడు? రోడ్లపై ఎలాంటి సభలు, సమావేశాలు పెట్టకూడదన్న జీవో ముఖ్యమంత్రికి వర్తించదా? జగన్ సభకు వచ్చిన పార్వతమ్మ అనే మహిళ బస్సు కిందపడి కాళ్లు విరగ్గొట్టుకుంది. 

తన సభలకు ప్రజలు రావడం లేదన్న అక్కసుతోనే ముఖ్యమంత్రి జీవోనెం.01ను ప్రతిపక్షాలపై అమలుచేస్తూ కర్కశంగా వ్యవహరిస్తున్నాడు. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం, ప్రతిపక్ష కార్యకర్తలపై దాడిచేయడం, వారి ఆస్తుల్ని ధ్వంసంచేయడం, మీడియాకు సంకెళ్లు వేయడం ఇదేనా జగన్ రెడ్డి పాలన? బ్రిటీష్ పోకడలతో తాను తీసుకొచ్చిన జీవో నెం.01ని జగన్ రెడ్డి తక్షణమే ఉపసంహరించుకోవాలి” అని గోరంట్ల డిమాండ్ చేశారు.


More Telugu News