పురుషులలో భవిష్యత్తు వ్యాధుల ముప్పును చెప్పే ఒకే ఒక్క హార్మోన్!

  • కౌమార దశలో కనిపించే ఐఎన్ఎస్ఎల్3 హార్మోన్
  • జీవితాంతం ఒకే స్థాయిలో ఉండి వృద్ధాప్యంలో తగ్గుదల
  • యుక్త వయసులో తక్కువ ఉండే వారికి వృద్ధాప్యంలో అనారోగ్యం రిస్క్
నడి వయసులో ఉన్నాం.. మరి కొన్నేళ్లలో మనకు వ్యాధులు వస్తాయో.. లేదో తెలుసుకునేది ఎలా? తెలుసుకోవచ్చని చెబుతున్నారు పరిశోధకులు. మనలో ఉండే ఐఎన్ఎస్ఎల్3 అనే హార్మోన్ స్థాయిని వారు ప్రస్తావిస్తున్నారు. పురుషులలో టీనేజ్ (కౌమార దశ) ఆరంభంలో ఈ హార్మోన్ తయారీ మొదలవుతుంది. అక్కడి నుంచి జీవితాంతం ఒకే స్థాయిలో ఉంటూ వృద్ధాప్యంలో కాస్త తగ్గుతుంది. 

యుక్త వయసులో ఈ హార్మోన్ తక్కువగా ఉన్న మగవారికి వృద్ధాప్యంలో మరింత తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో తెలిసింది. ఈ హార్మోన్ యుక్త వయసులో తక్కువగా ఉందంటే భవిష్యత్తులో మరింత తగ్గినప్పుడు కచ్చితంగా వ్యాధులు చుట్టుముడతాయనేది వీరి అంచనా. కనుక చిన్న వయసులోనే దీన్ని తెలుసుకోవడం ద్వారా భవిష్యత్తులో వారు వ్యాధుల బారిన పడకుండా ముందస్తు నివారణ చర్యలు తీసుకోవడానికి వీలు పడుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. 

‘‘కొంత మందికి వయసు పెరిగేకొద్దీ అనారోగ్యం, వ్యాధులు ఎందుకొస్తాయన్నది అర్థం చేసుకోవడం అవసరం. అప్పుడే వారు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించే మార్గాలను కనుగొనగలం. దీన్ని అర్థం చేసుకునేందుకు మా హర్మోన్ ఆవిష్కరణ ఓ కీలకమైన అడుగు అవుతుంది. ప్రజలకు వ్యక్తిగతంగానే కాకుండా, సమాజంలో నేడు ఎదుర్కొంటున్న సంరక్షణ సంక్షోభాన్ని సైతం అధిగమించడానికి మార్గం సుగమం చేస్తుంది’’ అని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్ హమ్ రీప్రొడక్టివ్ ఎండోక్రైనాలజిస్ట్ రవీంద్ర ఆనంద్ పేర్కొన్నారు. 



More Telugu News