బూస్టర్ డోస్ తో ఎక్కువ రోజుల పాటు కోవిడ్ యాంటీబాడీలు

  • ప్రైమరీ డోస్ లు తీసుకున్న వారు బూస్టర్ డోస్ కూడా తీసుకోవాలి
  • దీనివల్ల శరీరంలో మరింత కాలం పాటు కోవిడ్ యాంటీబాడీలు
  • దీంతో మహమ్మారి నుంచి తగినంత రక్షణ
బూస్టర్ డోస్ ఎందుకులే? అని అనుకునే వారి కళ్లు తెరిపించే అంశాలు తాజా అధ్యయనంలో వెల్లడయ్యాయి. ఫైజర్, మోడెర్నా ఎంఆర్ఎన్ఏ బూస్టర్ డోస్ లతో కరోనా నిరోధక యాంటీబాడీలు ఎక్కువ రోజుల పాటు ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. వర్జీనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ తరఫున ఈ పరిశోధన జరిగింది.

కరోనాకు సంబంధించి ఇంతకుముందు తీసుకున్న టీకాతో ఏర్పడిన యాంటీబాడీలు నిలిచి ఉండే కాలాన్ని బూస్టర్ డోస్ పెంచుతున్నట్టు ఈ పరిశోధనలో పాల్గొన్న సీనియర్ రీసెర్చర్ డాక్టర్ జెఫ్రీ విల్సన్ తెలిపారు. ప్రైమరీ డోస్ ల కంటే బూస్టర్ డోస్ యాంటీబాడీలను ఎక్కువగా వృద్ధి చేస్తున్నట్టు గతంలో అనుకునే వాళ్లమని, కానీ అది నిజం కాదని చెప్పారు. 

కరోనా ఇన్ఫెక్షన్ బారిన పడిన వారిలో సహజంగా యాంటీబాడీలు వృద్ధి చెందుతాయి. అలాగే, టీకా తీసుకున్న వారిలోనూ ఇవి ఏర్పడతాయి. కాకపోతే వీటి జీవిత కాలం తక్కువే. అందుకనే కరోనా బూస్టర్ డోస్ తీసుకోవాలి. దీనివల్ల కోవిడ్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు మరింత కాలం పాటు మన శరీరంలో ఉంటాయి. ఫలితంగా మహమ్మారి నుంచి రక్షణ ఉంటుంది. ఫైజర్ బూస్టర్ కంటే మోడెర్నా బూస్టర్ తో ఎక్కువ కాలం పాటు యాంటీబాడీలు ఉంటున్నట్టు ఈ పరిశోధన తేల్చింది.


More Telugu News