ఆ సినిమాలతో 'శాకుంతలం'కి పోటీ ఉందా?

  • వచ్చేనెల 17న 'శాకుంతలం' రిలీజ్ 
  • అదే రోజున బరిలో దిగుతున్న మూడు సినిమాలు 
  • కంటెంట్ పరంగా 'శాకుంతలం' స్థానం ప్రత్యేకం
  • ఇది అనుభూతి ప్రధానమైన దృశ్యకావ్యం
సమంత అభిమానులంతా ఇప్పుడు 'శాకుంతలం' సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. చారిత్రక .. పౌరాణిక సినిమాలను తెరకెక్కించడంలో మంచి అనుభవం ఉన్న గుణశేఖర్ ఈ సినిమాను రూపొందించారు. ఆయన సొంత బ్యానర్లో ఈ సినిమా నిర్మితమైంది. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఫిబ్రవరి 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇది కణ్వ మహర్షి .. శకుంతల .. దుష్యంతుడు మధ్య నడిచే కథ. ఈ సినిమాను గుణశేఖర్ పాన్ ఇండియా స్థాయిలో దృశ్య కావ్యంగా మలుస్తున్నారు. ఈ సినిమా విడుదలవుతున్న ఫిబ్రవరి 17వ తేదీనే ధనుశ్ సినిమా 'సార్' .. విష్వక్సేన్ 'ధమ్కీ' .. కిరణ్ అబ్బవరం 'వినరో భాగ్యము విష్ణుకథ' సినిమాలు థియేటర్లలో దిగుతున్నాయి. ఆ రోజున ఈ సినిమాల మధ్య పోటీ ఉంటుందనే టాక్ నిన్నటి నుంచి ఊపందుకుంది. 

కానీ సమంతకి ఉన్న ఇమేజ్ వేరు .. 'శాకుంతలం' సినిమాకి ఉన్న క్రేజ్ వేరు. 'శాకుంతలం' ఒక ప్రత్యేకమైన జోనర్ కి చెందిన కథ. దీనికి కాళిదాసు రాసిన 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారం. ఈ కథ ప్రకృతిని కూడా ఒక పాత్రగా చేసుకుని నడుస్తుంది. అందువల్లనే గ్రాఫిక్స్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇక మణిశర్మ సంగీతం .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమా స్థాయిని పెంచనుంది. 

ఈ కథలో పాత్రలు తక్కువే అయినా .. ప్రతి పాత్రకి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఆ పాత్రలను దేవ్ మోహన్ .. మోహన్ బాబు .. ప్రకాశ్ రాజ్ .. గౌతమి .. కబీర్ బేడీ .. కబీర్ దుహాన్ సింగ్ .. సచిన్ ఖేడ్కర్ వంటి వారు పోషించారు. సమంత క్రేజ్ .. గుణశేఖర్ టేకింగ్ .. 'శాకుంతలం' కంటెంట్ .. మణిశర్మ మార్క్ ముందు మిగతా సినిమాలను పోటీగా భావించలేమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


More Telugu News