పవన్ మాట విన్న హరిరామజోగయ్య... దీక్ష విరమణ

  • కాపు రిజర్వేషన్ల కోసం హరిరామజోగయ్య ఉద్యమబాట
  • తన నివాసంలోనే నిరాహార దీక్షకు దిగిన వైనం
  • ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • హరిరామజోగయ్యకు ఫోన్ చేసి మాట్లాడిన పవన్
కాపు రిజర్వేషన్ల కోసం 85 ఏళ్ల వయసులో ఉద్యమించిన సీనియర్ రాజకీయవేత్త హరిరామజోగయ్య ఎట్టకేలకు దీక్ష విరమించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఆయన తన నివాసంలో నిరాహార దీక్షకు దిగడం తెలిసిందే. వయసు, ఆరోగ్యం రీత్యా పోలీసులు ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా ఆయన దీక్ష కొనసాగించేందుకు ప్రయత్నించారు.

అయితే, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్... హరిరామజోగయ్యకు ఫోన్ చేసి మాట్లాడారు. సమగ్రంగా చర్చించి ముందుకు వెళదామని హరిరామజోగయ్యకు పవన్ నచ్చచెప్పారు. మందులు వేసుకోకుండా దీక్షకు దిగడం సాహసోపేతమైన నిర్ణయం అని, ఇది సరికాదని పవన్... హరిరామజోగయ్యకు తెలిపారు. వెంటనే దీక్ష విరమించాలని సూచించారు. 

పవన్ విజ్ఞప్తికి హరిరామజోగయ్య సానుకూల రీతిలో స్పందించారు. దీక్ష విరమిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, హరిరామజోగయ్య దీక్ష విరమించిన నేపథ్యంలో, ఆయనను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయనున్నారు.


More Telugu News