మహాసేన రాజేశ్ ను ఫోన్ లో పరామర్శించిన పవన్ కల్యాణ్

  • మహాసేన రాజేశ్ పై రాజమండ్రిలో దాడి
  • ఖండించిన పవన్ కల్యాణ్
  • రాజేశ్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న వైనం
మహాసేన రాజేశ్ పై తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో దాడి జరగడం తెలిసిందే. జనసేన నేత వై.శ్రీను పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు మహాసేన రాజేశ్ రాగా, కొందరు వ్యక్తులు ఆయన కారును ధ్వంసం చేశారు. పోలీసులు వచ్చి ఇరువర్గాలకు సర్దిచెప్పి, మహాసేన రాజేశ్ ను అక్కడి నుంచి పంపించివేశారు. 

ఈ నేపథ్యంలో, మహాసేన రాజేశ్ కు జనసేనాని పవన్ కల్యాణ్ ఫోన్ చేసి పరామర్శించారు. దాడి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. మహాసేన రాజేశ్ పై రాజమండ్రిలో జరిగిన దాడి అప్రజాస్వామికమని పేర్కొన్నారు. భావప్రకటన స్వేచ్ఛను హరించేలా జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. 

ప్రజాసమస్యలపైనా, పాలనా వ్యవస్థలోని లోపాలను రాజేశ్ ప్రశ్నిస్తుంటారని, అధికార పార్టీ నేతల దోపిడీలను, దాష్టీకాలను ప్రశ్నిస్తుంటారని పవన్ వెల్లడించారు. అలాంటి గొంతుకను నిలువరించే ప్రయత్నంలోనే అధికార పార్టీ వ్యక్తులు ఆదివారం నాడు రాజేష్ పై దాడి చేశారని పవన్ కల్యాణ్ తెలిపారు. 

పాలకులు... ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాల్లో దాడులు, హింసాపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వెల్లడించారు. ఈ తరహా దుశ్చర్యలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఈ పెడ పోకడలను ఆదిలోనే ప్రజాస్వామ్యబద్ధంగా అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు.


More Telugu News