ఇకపై కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు: రేవంత్ రెడ్డి

  • సర్పంచుల సమస్యలపై ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్
  • రేవంత్ రెడ్డి గృహనిర్బంధం
  • అయినప్పటికీ వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్
  • పీఎస్ కు తరలించిన పోలీసులు
  • కేసీఆర్ పై ధ్వజమెత్తిన టీపీసీసీ చీఫ్
సర్పంచుల సమస్యల నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సర్పంచుల నిధుల సమస్యలపై కాంగ్రెస్ పార్టీ 'రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్' పేరిట ధర్నాకు పిలుపునిచ్చింది. అయితే రేవంత్ ను పోలీసులు గృహనిర్బంధం చేయగా, ఆయన ధర్నాకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో అరెస్ట్ చేసి పీఎస్ కు తరలించారు. 

రేవంత్ మాట్లాడుతూ, రాష్ట్రంలో బీహార్ అధికారుల రాజ్యం నడుస్తోందని అన్నారు. తెలంగాణతో టీఆర్ఎస్ కు ఇప్పటిదాకా పేరు బంధం ఉండేదని, ఇప్పుడు పార్టీ పేరు మార్చడంతో ఆ బంధం తెగిపోయిందని తెలిపారు. ఇకపై కేసీఆర్ తెలంగాణకు పరాయివాడు, కిరాయివాడు అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు సమస్యను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. 

రూ.35 వేల కోట్ల పంచాయతీ నిధులు కొల్లగొట్టి మేఘా, ప్రతిమ సంస్థలకు చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు. సర్పంచుల ఖాతాల్లో వెంటనే నిధులు జమ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులను వేరే పథకాలకు మళ్లిస్తున్నారని, పంచాయతీల నిధులను పంచాయతీలకే ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిధుల కోసం సర్పంచులు బిచ్చమెత్తుకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. 

కాగా, ధర్నా నేపథ్యంలో ఇవాళ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ధర్నా చౌక్ కు వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు గేట్లు దూకి వెళ్లేందుకు యత్నించారు. ఈ సందర్భంగా అక్కడ పోలీసులు, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.


More Telugu News