పవన్... కందుకూరు, గుంటూరు ఘటనలపై ఎందుకు మాట్లాడడంలేదు?: మంత్రి రోజా

  • గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ  
  • తొక్కిసలాటలో ముగ్గురు మహిళల మృతి
  • చంద్రబాబుది పబ్లిసిటీ పిచ్చి అంటూ రోజా విమర్శలు
  • అమాయకులు బలవుతున్నారని వ్యాఖ్యలు
గుంటూరులో ఉయ్యూరు ఫౌండేషన్ కార్యక్రమం విషాదాంతం కావడం పట్ల ఏపీ మంత్రి రోజా స్పందించారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చికి అమాయకులు బలవుతున్నారని వ్యాఖ్యానించారు. ఇరుకు రోడ్లపై సభలు పెట్టి జనాలను చంపేస్తున్నారని విమర్శించారు. పేదవాళ్ల ప్రాణాలంటే చంద్రబాబుకు అంత చులకనా? అంటూ మండిపడ్డారు. 

గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు 29 మందిని పొట్టనబెట్టుకున్నారని అన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని 40 మందిని పొట్టనబెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్... కందుకూరు, గుంటూరు ఘటనలపై ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు. చంద్రబాబు వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నా పవన్ కు కనిపించడంలేదా? పవన్ తన నోటికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? అంటూ నిలదీశారు. చంద్రబాబు తప్పుడు మాటలను వినే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరని రోజా స్పష్టం చేశారు. 

ఇక, లోకేశ్ పాదయాత్రను అడ్డుకునేందుకు ఇలాంటి కుట్రలు చేస్తున్నారంటూ విపక్ష నేతలు ఆరోపిస్తుండడంపై రోజా బదులిచ్చారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని అన్నారు. లోకేశ్ పాదయాత్ర చేస్తే టీడీపీకే నష్టం అని స్పష్టం చేశారు. అందుకే లోకేశ్ పాదయాత్ర పట్ల టీడీపీ నేతలే భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. అటు, ఉత్తపుత్రుడి వెంట కాకుండా దత్తపుత్రుడి వెంట చంద్రబాబు వెళుతున్నాడని లోకేశ్ కూడా కోపంతో ఉన్నాడని రోజా పేర్కొన్నారు. లోకేశ్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమేనని రోజా వ్యాఖ్యానించారు.


More Telugu News