పర్సనల్ లోన్ ఈఎంఐ భారం తగ్గడానికి ఏమి చేయొచ్చు?
- మరో మార్గం లేకపోతేనే వ్యక్తిగత రుణానికి వెళ్లాలి
- బంగారం తనఖాపై తక్కువ రేటుకే రుణం
- గృహ రుణాలపై టాపప్ లోన్లు.. వీటిపైనా రేటు తక్కువే
వ్యక్తిగత రుణాలు తీసుకునే వారి సంఖ్య ఏటేటా పెరిగిపోతోంది. ఇవి అన్ సెక్యూర్డ్ రుణాలు. అంటే రుణం ఎగ్గొడితే బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ సంస్థలు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ రిస్క్ ఉంటుందనే అవి అధిక రేటుపై ఈ రుణాలను జారీ చేస్తుంటాయి. ప్రస్తుతం వీటిపై 12 శాతం పైనే రుణ రేటు అమల్లో ఉంది. పైగా ఐదేళ్ల వరకు కాల వ్యవధితో వస్తాయి. దీంతో ఈఎంఐ భారం ఎక్కువగా ఉంటుంది. కనుక మరో ప్రత్యామ్నాయం లేకపోతేనే పర్సనల్ లోన్ ను పరిశీలించాలి.
అసలు ఏ అవసరం కోసం రుణం తీసుకుంటున్నారన్నది ముందుగా స్పష్టతకు రావాలి. ఇంటి నవీకరణ కోసం అయితే గృహ రుణాలకు అనుబంధంగా పలు బ్యాంకులు, ఎన్ బీఎఫ్ సీ సంస్థలు హోమ్ ఇంప్రూవ్ మెంట్ లోన్లు టాపప్ లోన్లు ఇస్తుంటాయి. వీటిపై రేటు గృహరుణం రేట్ల స్థాయిలోనే ఉంటుంది. కనుక వీటిని పరిశీలించొచ్చు. టాపప్ లోన్ తీసుకున్నా, అది ఇతర అవసరాలకు వినియోగించుకోవచ్చు.
బంగారంపై బ్యాంకులు 6-7 శాతానికే రుణాలను మంజూరు చేస్తున్నాయి. బంగారం రూపంలో హామీ ఉంటుంది కనుక బ్యాంకులు తక్కువ రేటుకు వీటిని జారీ చేస్తుంటాయి. అందుకని తమ వద్ద వినియోగించని ఆభరణాలను బ్యాంకులో తనఖా ఉంచి రుణం పొందొచ్చు. దీనివల్ల పెద్ద మొత్తమే ఆదా అవుతుంది.
వాహనం కోసం అయితే.. డీలర్లు తక్కువ వడ్డీ రేటుపై ఆఫర్ చేసినప్పుడు కొనుగోలు చేయాలి. దీనివల్ల ఈఎంఐ భారం తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీలు ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తుంటాయి.
రుణంపై ఈఎంఐ భారం తగ్గించుకోవాలని అనుకునేవారు పొదుపు సొమ్ముతో పాక్షికంగా తీర్చేయడం మరో మార్గం. లేదంటే ఈఎంఐ భారం తగ్గించుకునేందుకు చివరి మార్గం.. రుణం కాల వ్యవధిని పెంచుకోవడం. దీనివల్ల మొత్తం మీద చెల్లించే వడ్డీ పెరుగుతుంది. కానీ, నెలవారీ చెల్లింపుల భారం కొంత తగ్గుతుంది.