జిమ్ లో చేరుతున్నారా..? ముందు డాక్టర్ క్లియరెన్స్ తీసుకోండి!

  • శరీరం ఎంత శ్రమను ఓర్చుకోగలన్నది తెలుసుకోవాలి
  • ఇందుకోసం ముందుగా వైద్యులను సంప్రదించాలి
  • తీసుకునే ఆహారం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందంటున్న వైద్యులు
జిమ్ కు వెళ్లి శరీరాన్ని మంచి భంగిమలతో తీర్చిదిద్దేందుకు ప్రయత్నించే వారు బోలెడు మంది. కొందరు మాత్రం కేవలం ఆరోగ్యం కోసమే జిమ్ కు వెళుతుంటారు. కారణం ఏదైనా కానీయండి.. జిమ్ కు వెళ్లి స్వల్ప స్థాయి (శ్రమ తక్కువగా వెచ్చించే) కసరత్తులు చేయవచ్చేమో కానీ, ఒత్తిడి మరీ పడే వ్యాయామాలకు దూరంగా ఉండడమే మంచిది. లేదంటే కనీసం వైద్యుల సలహా తీసుకున్న తర్వాతే జిమ్ లో కఠోర సాధనాలకు వెళ్లాలి.

జిమ్ లో కసరత్తులు చేసే వారు ముందుగా తమ శరీరం ఎంత శ్రమను ఓర్చుకోగలదన్నది తెలుసుకోవాలని మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ విభాగం హెడ్ అయిన బల్బీర్ సింగ్ సూచించారు. ‘‘జిమ్ లో ఎక్సర్ సైజులు చేయడం మంచిదే. మెడికల్ సైన్స్ గురించి జిమ్ శిక్షకులకే కొద్దిగా ఐడియా ఉంటుంది. మొదట కండరాల నిర్మాణం, తదుపరి కఠోర వ్యాయామాలనేవి అందరికీ అనుకూలం కాకపోవచ్చు. అందుకే జిమ్ కు వెళ్లడానికి ముందు ఎవరికి వారు మదింపు వేసుకోవాలి. దీనివల్ల వ్యాయామాలు చేసే సమయంలో ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవచ్చు’’ అని పేర్కొన్నారు.

ఇటీవల జిమ్ లలో సాధనాలు చేస్తూ మరణాలు కోల్పోతున్న అంశంపైనా బల్బీర్ సింగ్ మాట్లాడారు. ‘‘వ్యాయామాలతోపాటు ఏది తినాలన్నది కూడా ముఖ్యమే అవుతుంది. తీసుకునే ఆహారం ఆరోగ్యాన్నివ్వాలి. చురుకైన జీవనానికి అనుకూలించాలి. కసరత్తులు చేసే సమయంలో ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకోవడం అవసరం. నేడు అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షలు, చికిత్సా సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి‘‘ అని వివరించారు.


More Telugu News