ఏపీలో అమలులోకి వచ్చిన ఫేషియల్ అటెండెన్స్

  • మరింత పారదర్శకత కోసం బయోమెట్రిక్ స్థానంలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
  • ప్రస్తుతం సచివాలయం సహా కొన్ని ఆఫీసుల్లోని ఉద్యోగులపై పరీక్షించిన అధికారులు
  • ఈ నెల 16 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లోని ఉద్యోగులకూ అమలు
ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్ అటెండెన్స్ విధానం ఈరోజు (సోమవారం) నుంచి అమలులోకి వచ్చింది. అయితే, ప్రయోగాత్మకంగా పదిహేను రోజుల పాటు ఈ విధానాన్ని సచివాలయంతో పాటు హెచ్ వోడీ, జిల్లా కార్యాలయాల్లో మాత్రమే అధికారులు అమలు చేశారు. ఈ నెల 16 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ విధానాన్ని అమలు చేయనున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటివరకు బయోమెట్రిక్‌ హాజరును అమలుచేస్తూ వచ్చిన ప్రభుత్వం.. ఉద్యోగుల్లో మరింత రెస్పాన్సిబిలిటీని పెంచేందుకు, పారదర్శకత కోసం ఫేషియల్‌ అటెండెన్స్‌ను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా దీనిని తప్పనిసరి చేయనుంది. ఇందుకోసం ఐటీ శాఖ ఇప్పటికే తీసుకొచ్చిన అప్లికేషన్ ను ఉద్యోగులు డౌన్ లోడ్ చేసుకుని, రోజూ హాజరు పలకాల్సి ఉంటుంది. 

రాష్ట్రస్థాయి ఉద్యోగులు ఉదయం 10 నుంచి సాయంత్రం ఐదున్నర వరకు.. జిల్లాస్థాయి ఉద్యోగులు ఉదయం పదిన్నర నుంచి సాయంత్రం 5 గంటల వరకు కచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది. దీనిపై ఎప్పటికప్పుడు మిడ్ లెవల్ లో ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారని సమాచారం.


More Telugu News