గుంటూరులో తొక్కిసలాటపై పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి

  • తొక్కిసలాటలో ముగ్గురు మహిళలు మృతి చెందడం బాధాకరమన్న పవన్
  • కందుకూరు ఘటన మరువక ముందే ఇది జరగడం ఆందోళన కలిగించిందని వ్యాఖ్య
  • పోలీసు యంత్రాంగం తగిన భద్రత ఏర్పాటు చేయాలని సూచన
గుంటూరులో నిర్వహించిన చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. టీడీపీ, ఉయ్యురు ఫౌండేషన్ నిర్వహించిన ఎన్టీఆర్ జనతా వస్త్రాలు, చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకున్న తొక్కిసలాట దురదృష్టకరమని అన్నారు. జనతా వస్త్రాలు, కానుకల కోసం వచ్చిన ముగ్గురు పేద మహిళలు మృత్యువాత పడటం దిగ్భ్రాంతి కలిగించిందని చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. 

కందుకూరు టీడీపీ సభలో తొక్కిసలాట మూలంగా ఎనిమిది మంది మృతి చెందిన ఘటన మరువక ముందే ఇప్పుడు గుంటూరులో తొక్కిసలాట చోటుచేసుకోవడం ఆందోళనకు గురి చేసిందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్ఠమైన చర్యలు చేపట్టడంతో పాటు పోలీసు యంత్రాంగం తగిన భద్రతను ఏర్పాటు చేయాలని చెప్పారు.


More Telugu News