ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. భక్తులతో ఆలయాల కిటకిట!

  • తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తులు
  • తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం
  • సింహాచలంలో తొలి దర్శనం చేసుకున్న అకోశ్ గజపతి రాజు
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు ఈ తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. తిరుమల, అన్నవరం, ద్వారకా తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, యాదాద్రి, భద్రాచలం, ధర్మపురి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. భద్రాచలంలో ఉత్తర ద్వారం ద్వారా భక్తులు రామయ్యను దర్శించుకుంటుండగా, సింహాచలంలో ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. 

తిరుమలలో అర్ధరాత్రి 12.05 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మొదట వీవీఐపీలు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటల నుంచి ఆరు గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. కాగా, తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠ ద్వారం ద్వారా భక్తులను అనుమతిస్తారు. 

తిరుమల శ్రీవారిని ఇప్పటి వరకు దర్శించుకున్న వారిలో తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఉషశ్రీ, మేరుగ నాగార్జునతోపాటు తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్ , మల్లారెడ్డి తదితరులు ఉన్నారు.


More Telugu News