హరిరామ జోగయ్య ‘కాపు’ రిజర్వేషన్ల సాధన దీక్ష భగ్నం.. ఏలూరు ఆసుపత్రికి తరలింపు

  • కాపు రిజర్వేషన్ల సాధన కోసం దీక్షకు సిద్ధమైన హరిరామ జోగయ్య
  • గత రాత్రి 11 గంటల సమయంలో అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • తనకేదైనా జరిగితే జగన్‌దే బాధ్యతన్న హరిరామ జోగయ్య
కాపు రిజర్వేషన్ల సాధన కోసం పాలకొల్లులో నేటి నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన మాజీమంత్రి, కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి హరిరామ జోగయ్యను గత రాత్రి పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీక్ష కోసం ఆయన నివాసం వద్ద ఉదయం నుంచీ ఏర్పాట్లు జరిగాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు ఆయన ఇంటికి వెళ్లే రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. ఈ సందర్భంగా జోగయ్యతో పోలీసులు మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి కాపు రిజర్వేషన్లపై జీవో విడుదలయ్యేలా చూడాలని జోగయ్య పోలీసులను కోరారు. 

మరోవైపు, రాత్రి దాదాపు 11 గంటల సమయంలో జోగయ్య ఇంటికి చేరుకున్న సుమారు 400 మంది పోలీసుల భద్రత మధ్య జోగయ్యను అదుపులోకి తీసుకున్నారు. అంబులెన్సులోకి ఎక్కించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతకుముందు ఓ వీడియో విడుదల చేసిన జోగయ్య.. 2వ తేదీ ఉదయం 9 గంటల నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్టు చెప్పానని, కానీ పోలీసుల తీరు కారణంగా తక్షణం దీక్ష ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. తనకు ఏదైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి, పోలీసులు కారణమవుతారని పేర్కొన్నారు.


More Telugu News