గుంటూరు తొక్కిసలాట ఘటనపై ఎస్పీ వివరణ

  • గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ
  • హాజరైన చంద్రబాబు
  • చంద్రబాబు వెళ్లిన తర్వాత తొక్కిసలాట
  • తాము సరిపడినంత బందోబస్తు ఇచ్చామన్న ఎస్పీ
  • బారికేడ్ విరగడంతో ప్రమాదం జరిగిందని వివరణ
గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మహిళలు మృతి చెందడం తెలిసిందే. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ స్పందించారు. పంపిణీ సభలో ఏర్పాటు చేసిన తొలి కౌంటర్ వద్దే తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు. తాము సరిపడినంత బందోబస్తు ఇచ్చామని, బారికేడ్లు విరిగిపడడంతోనే ప్రమాదం జరిగిందని వివరించారు. ముందుజాగ్రత్తలు తీసుకోవాలని తాము నిర్వాహకులకు చెప్పామని ఎస్పీ స్పష్టం చేశారు. 

చంద్రన్న కానుకల పంపిణీపై నిర్వాహకులు గత కొన్నిరోజులుగా ప్రచారం చేయడంతో, ఈ కార్యక్రమానికి భారీగా మహిళలు తరలివచ్చినట్టు తెలుస్తోంది. 

ఈ మధ్యాహ్నం 2 గంటల నుంచే మహిళలు క్యూలైన్లలో ఉన్నారని, అయితే ఓ కౌంటర్ వద్ద బారికేడ్ విరిగిపోవడంతో క్యూలైన్ లో ఉన్న మహిళలు ముందుకుపడిపోగా, వెనుక ఉన్నవారు ఒక్కసారిగా వారిపై పడడంతో ఓ మహిళ ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. నలుగురు గాయపడగా, వారిని ఆసుపత్రులకు తరలించారు. వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు.


More Telugu News