కాశీ నుంచి డిబ్రూగఢ్... 4 వేల కిలోమీటర్ల రివర్ క్రూయిజ్

  • దేశంలో పర్యాటకానికి మరింత ఊతం
  • విదేశీ పర్యాటకులే లక్ష్యంగా అభివృద్ధి చర్యలు
  • జనవరి 13న రివర్ క్రూయిజ్ ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారతదేశాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా మలిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ లోని కాశీ క్షేత్రం (వారణాసి) నుంచి అసోంలోని డిబ్రూగఢ్ వరకు 4 వేల కిలోమీటర్ల సుదీర్ఘ రివర్ క్రూయిజ్ (నదీ జల నౌకా ప్రయాణం) ఏర్పాటు చేసింది. జనవరి 13న ఈ విలాసవంతమైన నౌకా ప్రయాణాన్ని ప్రధాని నరేంద్ర మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. 

నదీ మార్గంలో జరిగే ఈ నౌకా ప్రయాణం ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైనది. గంగ, భాగీరథి, హుగ్లీ, బ్రహ్మపుత్ర, వెస్ట్ కోస్ట్ కెనాల్ తదితర 27 నదుల గుండా 50 రోజుల పాటు ఈ లగ్జరీ క్రూయిజ్ సాగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ గత శుక్రవారం పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన పలు ప్రాజెక్టులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తూ, కాశీ-డిబ్రూగఢ్ నౌకా ప్రయాణం వివరాలు తెలిపారు. 

ప్రపంచంలో ఇంత సుదీర్ఘమైన రివర్ క్రూయిజ్ మరొకటి లేదని వెల్లడించారు. దేశంలో నౌకా ప్రయాణ పర్యాటకం అభివృద్ధి చెందుతోందనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు నుంచి లబ్ది పొందాల్సిందిగా పశ్చిమ బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని తెలిపారు. 

కాగా, ఈ రివర్ క్రూయిజ్ 50 పర్యాటక స్థలాల మీదుగా వెళుతుంది. వాటిలో వారణాసిలోని గంగా హారతి, కజిరంగా నేషనల్ పార్క్ లోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, సుందర్ బన్స్ డెల్టా ప్రాంతాలు వంటి కొన్ని వారసత్వ సంపదలు కూడా ఉన్నాయి. ఈ నౌకా యాత్ర బంగ్లాదేశ్ లో 1,100 కిమీ మేర సాగనుంది. ఈ నౌకా విహారం ఏర్పాట్లను ఓ ప్రైవేటు సంస్థకు అప్పగించినట్టు తెలుస్తోంది.


More Telugu News