ఈ ఆహార పదార్థాలతో గుండె జబ్బులను దూరంపెట్టొచ్చు!

  • జీవనశైలిలో మార్పులతో చిన్నవయసులోనే హృద్రోగాలు
  • మరణాల సంఖ్య కూడా పెరుగుతోందంటున్న నిపుణులు
  • బెర్రీస్, వాల్ నట్ లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని సూచన
జీవనశైలిలో మార్పుల కారణంగా చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పదేళ్లు కూడా లేని పిల్లాడు క్లాస్ రూంలోనే గుండెపోటుతో చనిపోయిన సంఘటనను గుర్తుచేస్తున్నారు. హృద్రోగాలతో మరణిస్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోందని చెబుతున్నారు. ఆహారపుటలవాట్ల వల్లే గుండె జబ్బుల ముప్పు పెరుగుతోందని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బును దూరం పెట్టాలంటే ఎలాంటి ఆహార పదార్థాలను తీసుకోవాలి..? ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారంటే..

బెర్రీస్
స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్‌బెర్రీ, రాస్ప్‌బెర్రీ.. మొదలైన బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో బెర్రీలకు చోటివ్వడం ద్వారా గుండెను జాగ్రత్తగా కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. 

వాల్‌నట్‌లు
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ ల పవర్ హౌస్ గా ఉండే ఈ వాల్ నట్ లు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడానికి తోడ్పడతాయి. శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. వీటితో హృద్రోగ ముప్పును తరిమేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.

ఆలివ్ ఆయిల్
గుండె పదిలంగా ఉండాలంటే వంటింట్లో ఆలివ్ ఆయిల్ కు చోటివ్వాలి. రోజువారి ఆహారపదార్థాలలో వాడుతూ, రోజుకు అర టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ గనక తీసుకుంటే.. గుండె జబ్బులు వచ్చే ముప్పు 15 శాతం తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ ఆయిల్ లోని యాంటీ ఆక్సిడెంట్లు, మోనోఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయని నిపుణులు వివరించారు.

చేపలు
చేపలలోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. సాల్మన్, టూనా, సార్డినెస్, మాకర్ ఎల్ తదితర రకాల చేపల్లో ఒమేగా-3 ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెప్పారు. చేప నూనెతో తయారుచేసిన క్యాప్సుల్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.


More Telugu News