హర్యానా మంత్రిపై వేధింపుల కేసు నమోదు

  • చండీగఢ్ పోలీసులకు మహిళా కోచ్ ఫిర్యాదు
  • మంత్రి తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన కోచ్
  • శుక్రవారం ప్రతిపక్ష పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు
  • మంత్రిని కేబినెట్ నుంచి తొలగించాలని సీఎం ఖట్టర్ ను డిమాండ్ చేసిన ప్రతిపక్ష నేతలు
హర్యానా క్రీడల మంత్రి సందీప్ సింగ్ పై చండీగఢ్ పోలీసులు లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. జూనియర్ అథ్లెటిక్స్ మహిళా కోచ్ ఫిర్యాదు మేరకు మంత్రిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఓ సర్టిఫికెట్ విషయంలో వ్యక్తిగతంగా కలవాలని పిలిచి, తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని మంత్రిపై మహిళా కోచ్ ఆరోపించిన విషయం తెలిసిందే. కేబినెట్ నుంచి వెంటనే సందీప్ సింగ్ ను తొలగించి, విచారణకు ఆదేశించాలని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ను ఆమె డిమాండ్ చేశారు.

శుక్రవారం ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్ డీ) పార్టీ ఆఫీసులో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి ఆమె ఈ ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నిరాధారమని మంత్రి సందీప్ సింగ్ కొట్టిపారేశారు. మహిళా కోచ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా స్పందిస్తూ.. కోచ్ ఆరోపణలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే..
మంత్రిపై ఫిర్యాదు చేసిన మహిళా కోచ్ చెప్పిన వివరాల ప్రకారం.. ఓ జిమ్ లో చూసి, ఇన్ స్టాగ్రాంలో మంత్రి తనను కాంటాక్ట్ అయ్యారని చెప్పారు. ఓ సర్టిఫికెట్ విషయంలో వ్యక్తిగతంగా వచ్చి కలవాలని పిలవడంతో.. మంత్రి క్యాంప్ కార్యాలయానికి వెళ్లినట్లు తెలిపారు. అక్కడ సందీప్ సింగ్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని, సర్టిఫికెట్ కావాలంటే తను చెప్పినట్లు నడుచుకోవాలని బెదిరించారని ఆరోపించారు. దీనిపై ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి, శుక్రవారం ప్రెస్ మీట్ పెట్టి వివరాలు వెల్లడించినట్లు మహిళా కోచ్ చెప్పారు.


More Telugu News