చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు మంత్రి జోగి రమేశ్ సవాల్

  • దమ్ముంటే 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్
  • 2022 చంద్రబాబుకు ఏడుపు మిగిల్చిన సంవత్సరమని వ్యాఖ్య
  • కందుకూరు ఘటనకు చంద్రబాబే కారణమని ఆరోపణ
2022 పేదలకు సంతోషాన్ని నింపిన సంవత్సరమని ఏపీ మంత్రి జోగి రమేశ్ అన్నారు. పేద వారికి విద్య, వైద్య, ఆరోగ్యం పరంగా విజయనామ సంవత్సరం అని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏడుపు మిగిల్చిన సంవత్సరమని ఎద్దేవా చేశారు. బూతులు తిడుతూ మాట్లాడే అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు వంటి నేతలకు బూతుల నామ సంవత్సరంగా మిగిలి పోయిందని అన్నారు. 

ప్రతి పేద కుటుంబానికి అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకునే మంచి మనసున్న నేత ముఖ్యమంత్రి జగన్ అని జోగి రమేశ్ కొనియాడారు. అభివృద్ధి అంటే చంద్రబాబుకో లేక ఆయన కులానికో మేలు జరగడం కాదని అన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టాలని సవాల్ విసిరారు. ఇదే సవాల్ ను పవన్ కల్యాణ్ కూడా స్వీకరించాలని అన్నారు. కందుకూరులో చోటుచేసుకున్న ఘటనకు చంద్రబాబే కారణమని... 8 మంది అమాయకుల ప్రాణాలు పోడానికి కారణమైన చంద్రబాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.


More Telugu News