ప్రపంచ బ్లిట్జ్ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి రికార్డ్!

  • కజకిస్థాన్‌లోని అల్మాటిలో ఫిడే ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్
  • తొలుత మూడు రౌండ్లలో ఓడి ఆ తర్వాత వరుస విజయాలు సాధించిన హంపి
  • విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ టోర్నీలో పతకం సాధించిన హంపి
  • 13వ స్థానంతో సరిపెట్టుకున్న ద్రోణవల్లి హారిక
కజకిస్థాన్‌లోని అల్మాటిలో జరుగుతున్న ఫిడే ప్రపంచ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో తెలుగమ్మాయి కోనేరు హంపి చరిత్ర సృష్టించింది. అప్పటి వరకు ఆధిక్యంలో ఉన్న ప్రత్యర్థులను ఓడించి రజత పతకం సాధించింది. మొత్తం 17 రౌండ్లలో 12.5 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. తొలి ఐదు గేముల్లో మూడు ఓటములు చవిచూసిన హంపి ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుని 12 రౌండ్లలో వరుస విజయాలతో అదరగొట్టింది. 

నిన్న 8 రౌండ్లు ఆడిన మరో తెలుగమ్మాయి ద్రోణవల్లి హారికతో గేమ్‌ను మాత్రమే డ్రా చేసుకున్న హంపి.. మిగిలిన అన్ని మ్యాచుల్లోనూ విజయాలు సాధించి 7.5 పాయింట్లతో రేసులోకి వచ్చింది. ఆ తర్వాత 16వ రౌండులో షవ్లోనాను ఓడించింది. చివరి రౌండులో తనకన్నా మెరుగైన రేటింగ్ ఉన్న టాన్ జాంగ్‌యీపై విజయం సాధించి రజతం సాధించింది. కేవలం అర పాయింట్‌తో పసిడి పతకాన్ని కోల్పోయింది. 

కాగా, విశ్వనాథన్ ఆనంద్ 2017లో ఈ టోర్నీలో పతకం అందుకున్నాడు. ఆ తర్వాత ఈ టోర్నీలో పతకం అందుకున్నది హంపి మాత్రమే. కాగా, ద్రోణవల్లి హారిక 10.5 పాయింట్లతో 13వ స్థానంతో సరిపెట్టుకుంది. ఓపెన్ విభాగంలో హరికృష్ణ 13 పాయింట్లతో 17వ స్థానంలో నిలవగా, అర్జున్ 12 పాయింట్లతో 42వ స్థానంలో నిలిచాడు. 16 పాయింట్లతో ర్యాపిడ్ టైటిల్ అందుకున్న కార్ల్‌సన్.. బ్లిడ్జ్ టైటిల్‌ను కూడా సొంతం చేసుకున్నాడు.


More Telugu News