పంజాబ్ లో ప్రభుత్వ పాఠశాలలకు కులం పేర్లు తొలగింపు

  • ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం
  • కులం, వర్గాన్ని సూచించే పేర్లు పాఠశాలలకు ఉండరాదని తీర్మానం
  • పంజాబ్ విద్యాశాఖ మంత్రి ఆదేశాలు
  • 56 పాఠశాలలకు పేర్లు మార్పు
కొన్ని చోట్ల ప్రభుత్వ పాఠశాలలకు వ్యక్తుల పేర్లు ఉండడం తెలిసిందే. ఆ పాఠశాలల స్థల దాతలు, భవన నిర్మాణానికి విరాళాలు ఇచ్చిన వారి పేర్లను పాఠశాలలకు పెడుతుంటారు. అయితే, పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏదైనా పాఠశాల పేరులో కులాన్ని, వర్గాన్ని సూచించే నామధేయం ఉంటే తొలగించాలని తీర్మానించింది. 

పాఠశాల అనేది సమానత్వానికి ప్రతీకగా ఉండాలని, పాఠశాలల పేర్లు ప్రత్యేకంగా ఒక కులాన్నో, వర్గాన్నో సూచించే విధంగా ఉండరాదని పంజాబ్ విద్యాశాఖ మంత్రి హర్ జోత్ సింగ్ పేర్కొన్నారు. పాఠశాలలకు కులం, వర్గం పేర్లు ఉంటే అది విద్యార్థుల్లో అనాగరికులమన్న భావనను కలిగిస్తుందని, పైగా సమాజంలో కులవిభజనకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. అందుకనే కులం, వర్గాన్ని సూచించే పేర్లను మార్చాలని ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. 

కాగా, మంత్రి ఆదేశాల నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల జాబితాను వడపోశారు. కులం, వర్గాన్ని సూచించే పేర్లు ఉన్న పాఠశాలలను గుర్తించారు. వారం రోజుల వ్యవధిలో 56 ప్రభుత్వ పాఠశాలలకు కులాన్ని సూచించే పేర్లను తొలగించారు. వాటి స్థానంలో స్థానిక అమరవీరుడు, లేకపోతే ఎవరైనా ప్రముఖ వ్యక్తి పేరుతో ఆయా పాఠశాలలకు పునఃనామకరణం చేశారు.


More Telugu News