నాంపల్లిలో 'నుమాయిష్' కు సర్వం సిద్ధం... జనవరి 1 నుంచి ఎగ్జిబిషన్

  • దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్ నుమాయిష్
  • జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఎగ్జిబిషన్
  • మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 వరకు ప్రదర్శన
హైదరాబాదులో ప్రతి ఏడాది నిర్వహించే పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన 'నుమాయిష్' కు రంగం సిద్ధమైంది. 'నుమాయిష్'కు ఎప్పట్లాగానే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా నిలవనుంది. జనవరి 1న ప్రారంభమయ్యే ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఈ ఎగ్జిబిషన్ ఉంటుంది. 

ఈ 82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో 2,400 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిలో విదేశీ సంస్థలకు చెందిన స్టాళ్లు కూడా ఉన్నాయి. కాగా, 'నుమాయిష్'లో ఈసారి టికెట్ ధర పెంచారు. గతంలో రూ.30 ఉన్న టికెట్ ధరను ఇప్పుడు రూ.40కి పెంచారు. ఐదేళ్ల లోపు వయసున్న చిన్నారులకు ప్రవేశం ఉచితం అని నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్ కు వచ్చే వారి వాహనాలకు ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. 

స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులకు ప్రచారం, ప్రోత్సాహం అందించాలన్న ఉద్దేశంతో 1938లో 'నుమాయిష్' ప్రారంభమైంది. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఈ పారిశ్రామిక ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. మొదట్లో 50 స్టాళ్లతో ప్రారంభమైన 'నుమాయిష్' ఇప్పుడు 2 వేలకు పైగా స్టాళ్లతో దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనగా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాదులో నిర్వహించే 'నుమాయిష్' ను నిత్యం 45 వేలమంది సందర్శిస్తారని అంచనా. 

కాగా, 2019లో నిర్వహించిన 'నుమాయిష్' లో భారీ అగ్నిప్రమాదం జరిగి వందలాది స్టాళ్లు కాలిబూడిదయ్యాయి. ఆ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. స్టాళ్ల నిర్వాహకులు ఎక్కడా వంటలు చేయకుండా నిషేధించారు. రెండు ఫైరింజన్లను అందుబాటులో ఉంచనున్నారు. 

విద్యుత్ వైర్లు, గ్యాస్ పైపుల విషయంలో అత్యంత భద్రమైన ఏర్పాట్లు చేసుకోవాలని స్టాళ్ల నిర్వాహకులకు అగ్నిమాపక శాఖ స్పష్టం చేసింది. ప్రతిస్టాల్ లోనూ ఫైర్ ఎక్స్ టింగ్విషర్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని పేర్కొంది.


More Telugu News