యూఏఈలో ఉద్యోగులకు ఏడాది పాటు పెయిడ్ లీవ్.. ఎందుకంటే..!

  • ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించిన యూఏఈ ప్రభుత్వం
  • వ్యాపారం ప్రారంభించేందుకు ఏడాది పాటు సగం జీతంతో సెలవు
  • ప్రభుత్వ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు
వ్యాపారం చేయాలని ఎంతగా మనసు కొట్టుకుంటున్నా సరే చేతిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకునే ధైర్యం చేయలేరు చాలా మంది.. వ్యాపారం దెబ్బకొడితే ఎలా అనే భయంతో నెల నెలా ఠంచనుగా వచ్చే జీతం డబ్బులు వదులుకునే రిస్క్ చేయరు. దీంతో వ్యాపారం చేయాలనే కల అటకెక్కుతుంది. ఇలాంటి వారికోసం యూఏఈ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఉద్యోగం వదులుకోకుండానే ఏడాది పాటు మీ కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయండని సెలవు ఇస్తోంది. ఈ ప్రయత్నంలో విజయవంతమైతే సరే.. లేదా తిరిగి ఉద్యోగం చేసుకునే అవకాశం ఉండనే ఉంది.

అంతేకాదు.. సెలవు పెట్టిన ఏడాదిలో నెలనెలా సగం జీతం కూడా ఇస్తామని యూఏఈ ఉపాధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులను వ్యాపారం వైపు ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వివరించారు. ఈ సెలవును వినియోగించుకోవాలని భావించే ఉద్యోగి వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. వారంలో ప్రభుత్వ ఉద్యోగుల పనిదినాలను నాలుగున్నర రోజులకు కుదిస్తూ యూఏఈ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.


More Telugu News