పాకిస్థాన్‌లో దారుణం.. హిందూ మహిళను చంపేసి, ఆపై చర్మం ఒలిచేసిన నిందితులు!

  • సింధు ప్రావిన్సులో ఘటన
  • పాక్ మీడియాలో ఈ వార్త కనిపించలేదన్న ‘ది రైజ్ న్యూస్’
  • మైనారిటీల విషయంలో పాకిస్థాన్ శ్రద్ధ వహించాలని కోరిన భారత్
పొరుగు దేశం పాకిస్థాన్‌లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సింధ్ ప్రావిన్స్‌లో హిందూ మహిళ దయా భీల్‌ను పాశవికంగా హత్య చేశారు. తార్‌పార్కర్ సింధ్ నుంచి పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సెనేటర్‌గా ఎన్నికైన తొలి హిందూ మహిళ కృష్ణ కుమారి ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 40 ఏళ్ల దయా భీల్‌ను దారుణంగా హత్య చేశారని, మొండెం నుంచి తలను వేరు చేశారని పేర్కొన్నారు. తల నుంచి చర్మాన్ని ఒలిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు బృందాలు ఘటనా స్థలికి చేరుకున్నాయన్నారు.

ఆమె హత్య మీడియాలో రాలేదని, ఇస్లామాబాద్‌లోని రాజకీయ నేతలు కానీ, సింధ్ ప్రభుత్వం నుంచి కానీ దీనిపై ఎలాంటి ప్రకటన లేదని ఎన్‌జీవో ‘ది రైజ్ న్యూస్’ పేర్కొంది.. ఇంతకీ నిందితులను పట్టుకుంటారా? అని ప్రశ్నించింది. హిందువులకు వారి మాతృభూమి అయిన సింధ్‌లో సమాన హక్కులు ఉన్నాయా? వారిని ముస్లింలతో సమానంగా చూస్తున్నారా? అని నిలదీసింది.

సింధ్ ప్రావిన్సులో హిందూ మహిళ దారుణ హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. భారత ప్రభుత్వం కూడా స్పందించింది. మైనార్టీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను నెరవేర్చాలని, వారికి భద్రత, తగిన రక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ.. మైనారిటీ విషయంలో పాకిస్థాన్ శ్రద్ధ వహించాలని గతంలో కూడా చెప్పామన్నారు. ఆ దేశం తమ బాధ్యతను నెరవేర్చాలన్నారు. కాగా, పాక్‌లో హిందూ మహిళ హత్యకు సంబంధించి తమ వద్ద సవివరమైన నివేదిక లేదని బాగ్చి తెలిపారు.


More Telugu News