అదృష్టం కలిసొచ్చి స్టార్స్ అయినవాళ్లున్నారు .. రవితేజ అలా కాదు: బండ్ల గణేశ్

  • సందడిగా జరిగిన 'ధమాకా' మాస్ మీట్
  • రవితేజను ఆకాశానికి ఎత్తేసిన బండ్ల గణేశ్
  • ఈ సినిమాలో ఆయన చెప్పిన ఆ డైలాగ్ కరెక్ట్ అని వ్యాఖ్య  
  • ఫ్లాప్ ఇచ్చిన దర్శకులకు ఛాన్స్ ఇచ్చిన హీరో అంటూ ప్రశంసలు
రవితేజ తాజా చిత్రమైన 'ధమాకా' హిట్ టాక్ తెచ్చుకోవడంతో, 'మాస్ మీట్' ను నిర్వహించారు. ఈ ఈవెంటుకి నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ కూడా హాజరయ్యాడు. ఆయన మాట్లాడుతూ .. "అస్తమించే రవిని చూశాము .. ఎప్పటికీ అస్తమించని రవితేజను గురించి మాట్లాడదామని వచ్చాను. ఆయన ఎప్పటికీ వెలుగునిచ్చే సూర్యుడు. ఇంతవరకూ చేసిన 70 సినిమాలలో 12 మంది కొత్తదర్శకులను పరిచయం చేసిన ఏకైక హీరో రవితేజ" అన్నాడు. 

'ఎనకా ముందు ఎవరూ లేకపోయినా పైకి రావడమెలాగో తెలిసినవాడినిరా' అని ఈ సినిమాలో ఆయన డైలాగ్ ఒకటి ఉంది .. అది హండ్రెడ్ పెర్సెంట్ కరెక్ట్. రాగానే అదృష్టం కలిసొచ్చి స్టార్లు అవుతారు. అలా కాకుండా చిన్న స్థాయి నుంచి ఎదిగిన రవితేజ చాలామందికి స్ఫూర్తి. అలాంటి ఆయన ఈ సినిమాతో అరాచకమే చేశాడు.

"ఈ సినిమాతో రవితేజ అయిపోతాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటి వారి కళ్లు తెరుచుకునే ఉండాలి .. ఎందుకంటే ఆయన కొట్టే మరో హిట్ చూడాలి. రవితేజ పని అయిపోవడమంటూ ఉండదు. రవితేజ టక్ చేస్తే ఆయన కుర్రాడవుతున్నాడా .. ముసలాడవుతున్నాడా తెలియడం లేదు. నిగనిగలాడుతున్న నల్లత్రాచులా ఉన్నాడు. ఫ్లాప్ ఇచ్చిన దర్శకులకు కూడా మళ్లీ ఛాన్స్ ఇచ్చిన మంచితనం ఆయన సొంతం. ఇలా మరెన్నో బ్లాక్ బస్టర్లు అందుకోవాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు..


More Telugu News