జగన్, విజయమ్మ పాదయాత్రల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయింది వాస్తవం కాదా?: వర్ల రామయ్య

  • చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో తీవ్ర విషాదం
  • కందుకూరు సభలో తొక్కిసలాట
  • 8 మంది టీడీపీ కార్యకర్తల మృతి
  • చంద్రబాబుపై వైసీపీ నేతల విమర్శల దాడి
  • రాజకీయ కక్కుర్తి అంటూ మండిపడిన వర్ల రామయ్య
టీడీపీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా పర్యటనలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం తెలిసిందే. కందుకూరులో చంద్రబాబు సభలో తొక్కిసలాట జరిగి 8 మంది కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుండడం పట్ల టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అదేస్థాయిలో స్పందించారు. కందుకూరులో చంద్రబాబు సభ పెట్టిన చోటే గతంలో జగన్ రెడ్డి, విజయమ్మ సభలు పెట్టడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి, విజయమ్మ పాదయాత్రల్లో 8 మంది మృతి చెంది, 45 మంది క్షతగాత్రులవ్వడం వాస్తవం కాదా? అని నిలదీశారు.

"జగన్ రెడ్డి పాలనలో వివిధ ప్రమాదాల్లో 173 మంది ప్రాణాలు కోల్పోయింది వాస్తవం కాదా? విషాద సమయంలో వైసీపీ దుష్ప్రచారాలు రాజకీయ కక్కుర్తి కాదా? ప్రధాని, గవర్నర్ స్పందించేంత వరకు సీఎం స్పందించలేదంటే ఆయన మానసిక స్థితి దేనికి అద్దం పడుతుంది?" అంటూ వర్ల రామయ్య నిప్పులు చెరిగారు.   

చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారంటూ వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు చాలా బాధాకరం అని పేర్కొన్నారు. "జగన్ రెడ్డి, తన తల్లి విజయమ్మ పాదయాత్రలు, బహిరంగ సభలు నిర్వహించిన సమయంలో అమాయకులు వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ మరణాలు జగన్ రెడ్డి, విజయమ్మ ప్రచార పిచ్చివల్లే జరిగిందా? అప్పుడు మీరు తీసిన డ్రోన్ విజువల్స్ ప్రచార పిచ్చికోసమేనా? దీనిపై జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

జగన్ రెడ్డి, తన తల్లి విజయమ్మ పాదయాత్రలు చేసి, బహిరంగ సభలు కూడా కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్ లోనే నిర్వహించారు. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు పోలీసు బందోబస్తు ఏర్పాటుచేసింది. కానీ జగన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు బహిరంగ సభలకు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొంటుంటే తగిన బందోబస్తు ఏర్పాటు చేయడంలో విఫలమైంది. 

కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్ కంటే పెద్ద రోడ్లు లేవు. ఆ సంగతి మీకు తెలిసి కూడా విమర్శలు చేయడం శవరాజకీయాలకు నిదర్శనం. మృతుల పట్ల కనీసం ఇంతైనా బాధ పడకుండా... వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు హాస్యాస్పద వ్యాఖ్యలు చేయడం పేదవాడి ప్రాణాలకు వైసీపీ ఇచ్చే విలువకు నిదర్శనం. 

ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు చలించిపోయి... వారి కుటుంబాలకు పార్టీ తరఫున రూ.15 లక్షలు నష్టపరిహారంతో పాటు వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని, వారి పిల్లల్ని ఎన్టీఆర్ ట్రస్టు భవన్ ఆధ్వర్యంలో చదివిస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యక్రమాలు, వ్యక్తిగత కార్యక్రమాలు వాయిదా వేసుకుని మృతిచెందిన వారికి నివాళులర్పిస్తూ నిబద్దతను చాటుకున్నారు. 

ఢిల్లీలో ఉన్న ప్రధాని తల్లి అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా... ఏపీలో జరిగిన విషయం పట్ల ముఖ్యమంత్రి కంటే ముందు స్పందించి... మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం ప్రకటించారు. అదే ఢిల్లీలో పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రికి ప్రధాని, గవర్నర్ తదితరులు స్పందించిన తర్వాత ఎప్పటికో స్పృహ రావడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం" అంటూ వర్ల రామయ్య సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


More Telugu News